ఘర్షణ కేసులో 9 మంది అరెస్ట్
హుబ్లీ: పాత హుబ్లీ తిమ్మసాగర రోడ్డులోని ఐటీఐ కళాశాల వద్ద డబ్బుల విషయంలో పరస్పరం దాడి చేసుకున్న కేసులో 9 మందిని పాత హుబ్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి తిమ్మసాగర నివాసులు దీపక్ పూజార, రాఘవేంద్ర, అమర పూజార, శంకర్ జితూరి, విఘ్నేష్, కుశాల బెళంకర, సాగర్ లక్కుండితో పాటు ఓ బాలుడిని అరెస్ట్ చేశారు. నిందితులు రూ.5 వేల కోసం ఈనెల 5న రాత్రి 11.30 గంటలకు పరస్పరం దాడి చేసుకున్నారు. ఘటనపై పాత హుబ్లీ పోలీసు స్టేషన్‌లో పరస్పరం కేసులు నమోదయ్యాయి. కేసులను తీవ్రంగా పరిగణించిన పాత హుబ్లీ సీఐ ఎంఎన్ సింధూర, ఎస్‌ఐ సొన్నవర నేతృత్వంలోని బృందం నిందితులను అరెస్ట్ చేయడంలో సఫలీకృతులయ్యారు. పోలీస్ కమిషనర్ శశికుమార్ సదరు పోలీస్ బృందాన్ని ప్రశంసించారు.
ఉత్తర కర్ణాటక వ్యతిరేక బడ్జెట్
హుబ్లీ: సీఎం సిద్దరామయ్య ప్రతిపాదించిన బడ్జెట్ ఉత్తర కర్ణాటకకు వ్యతిరేకంగా ఉంది. తన రికార్డు స్థాయి బడ్జెట్‌లో సమగ్ర కర్ణాటక అభివృద్ధి ఉంటుందని ఆశించిన వారికి నిరాశ కలిగించిందని స్వర్ణగ్రూప్ సంస్థల ఎండీ, హుబ్లీ ధార్వాడ డెవలప్‌మెంట్ ఫోరం కోశాధికారి, ప్రవాసాంధ్ర ప్రముఖుడు డాక్టర్ సీహెచ్‌వీఎస్‌వీ ప్రసాద్ అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరం, సుమారు 18 లక్షల మంది నివసించే హుబ్లీ– ధార్వాడ జంట నగరాలతో పాటు ఉత్తర కర్ణాటక అభివృద్ధిని సీఎం పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. సీఎం ఉత్తర కర్ణాటకపై సవతి తల్లి ధోరణిని చూపారని మండిపడ్డారు. ఫోరం జంట నగరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులతో పాటు వైద్యం, ఆరోగ్యం, విద్య, పరిశ్రమలు, సాగు నీటిపారుదల, రవాణా శాఖలకు, అలాగే కనీస సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇచ్చే కార్యక్రమాలను ప్రకటించాలని ప్రభుత్వానికి బడ్జెట్‌కు ముందే విజ్ఞప్తి చేశామన్నారు. అయినా ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదన్నారు. ఇక మహదాయి పథకం అమలుకు ఈ సర్కారుకు మనసు లేదు. కేవలం కేంద్ర సర్కారు వైపు వేలెత్తి చూపుతూ కాలహరణం చేస్తున్నారని ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగు యూనిట్లలో
స్తంభించిన విద్యుత్ ఉత్పత్తి
రాయచూరు రూరల్: రాయచూరు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(ఆర్టీపీఎస్)లో నాలుగు యూనిట్లు మూతపడ్డాయి. ఇటీవల వేసవి కాలంలో ఎండల తీవ్రత అధికం అవుతుండడంతో ఒక పక్క విద్యుత్ కోత(లోడ్‌షెడ్డింగ్) లేదంటూ సర్కార్ పెద్దలు చెబుతున్నా ఆర్టీపీఎస్‌లో నాలుగు యూనిట్ల బంద్‌తో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఎదురైంది. బాయిలర్ ట్యూబ్, బంకర్ లీకేజీల కారణంగా 210 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 1, 2, 3, 6వ యూనిట్లను స్తంభింప చేశారు. దీంతో 840 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కోత పడింది. మరో వైపు విజయపుర జిల్లాలోని ఆల్మట్టి డ్యాంలో అనుకున్నంత మేర నీటి నిల్వ లేదన్న విషయం తేటతెల్లమవుతోంది. ఇటీవలే ఒక టీఎంసీ నీటిని విడుదల చేశారు. నారాయణ పుర డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది వద్దకు వెళ్లరాదని, పశువులను మేతకు నది లోపలకు విడవరాదని కేబీజీఎన్‌ఎల్ చీఫ్ ఇంజినీర్ సురేష్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఆర్టీసీ బస్సులోనే మెకానిక్ ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: కేఎస్‌ఆర్‌టీసీ బస్సులోనే బెళగావి ఆర్టీసీ డిపో–1 మెకానిక్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావిలో శనివారం జరిగింది. అక్కడి హళే గాంధీనగర్‌కు చెందిన మెకానిక్ కేశవ్ కమడొళ్లి(57) కేఎస్‌ఆర్‌టీసీ బస్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్టీసీ బస్సు డిపో వాషింగ్ విభాగంలో మెకానిక్‌గా విధులు నిర్వర్తిస్తుండేవారు. కేశవ్‌కు వెన్ను నొప్పి ఉన్నా అధికారులు టైర్లకు పంచర్లు వేసే బాధ్యతలు అప్పగించారు. డ్యూటీని మార్చాలని అసిస్టెంట్ సూపరింటెండెంట్ అనిల్ బాందేకర్‌కు, డిపో మేనేజర్ లింగరాజ్ లాఠికు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో పని ఒత్తిళ్లను తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెకానిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే బెళగావి మార్కెట్ స్టేషన్ పోలీసులు బస్ డిపోకు చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడిని మానసిక అస్వస్థుడిగా చిత్రించిన ఆర్టీసీ అధికారుల తీరుపై మృతుని కుటుంబ సభ్యులు ఆక్రోశం వ్యక్తం చేశారు. ఏ ఆధారంగా మానసిక అస్వస్థుడని చెబుతారు, ఆరోగ్యం బాగోలేదు, డ్యూటీని మార్చవద్దని వేడుకున్నా పెడచెవిన పెట్టారని అధికారులపై మండిపడ్డారు. తమకు న్యాయం దొరికే వరకు బస్సు డిపో నుంచి మృతదేహాన్ని అంత్యక్రియలకు ఇంటికి తీసుకెళ్లబోమని భీష్మించారు.
ఘర్షణ కేసులో 9 మంది అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment