దర్శక, నిర్మాత ముఖానికి మసి
యశవంతపుర: కన్నడ ఫిలిం చాంబర్‌లో గొడవలు తీవ్రమయ్యాయి. ప్రముఖ దర్శకుడు, నిర్మాత, మాజీ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు నరసింహరాజు ముఖానికి కొందరు వ్యక్తులు మసి పూసి దాడి చేశారు. ఆయన బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి నగరంలో ఉండగా కొందరు దుండగులు ఈ అకృత్యానికి పాల్పడినట్లు తెలిపారు. దీనికి బదులుగా ఫిలిం చాంబర్ అధ్యక్షుడు నరసింహులు, సా.రా గోవిందు.. నరసింహరాజుపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువైపుల నుంచి ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చాంబర్ మీద ఆధిపత్యం గురించి రెండువర్గాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
విద్వేషాలను రెచ్చగొట్టే
బడ్జెట్: విజయేంద్ర
దొడ్డబళ్లాపురం: సీఎం సిద్దరామయ్య ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. శనివారంనాడు బెంగళూరు మల్లేశ్వరంలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన సిద్ధరామయ్య మైనారిటీలను తృప్తిపరిచే ప్రయత్నంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. మదరసాలకు డబ్బులు ఇచ్చారని, మౌల్వీలకు గౌరవధనం పెంచారని, ముస్లింల వివాహాలకు రూ.50వేలు కానుక ప్రకటించిన సీఎంకి హిందువుల్లో పేదలు ఉన్నారన్న కనీస జ్ఞానం లేదా అని ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్ సిద్దరామయ్య కాదు, మంత్రి జమీర్ అహ్మద్ తయారు చేయించినట్టు ఉందన్నారు. యువకులకు, మహిళలకు, నిరుద్యోగులకు, రైతులకు మొండిచేయి చూపించారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించి నిధుల్లో రూ.25 వేల కోట్లను ఇతర అవసరాలకు మళ్లించారన్నారు. అప్పులు విపరీతంగా పెరిగాయన్నారు.
టెన్త్ క్లాస్ ప్రేమ.. యమపాశమైంది
హుబ్లీ: వారిద్దరు ఇంకా ముక్కుపచ్చలారని బాలలు. చదువుకునే వయసులో స్నేహాన్ని ప్రేమ అనుకున్నారు. తమ ప్రేమ పెద్దలకు తెలిసి దండించారు, కలిసి జీవించలేమనే అపరిపక్వ ఆలోచనలతో జీవితాన్నే అంతం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి ఒకే తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కలుబుర్గి జిల్లా కలబుర్గి తాలూకా మల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన మాలప్ప (16), మరో మతానికి చెందిన బాలిక (16) ఈ అకృత్యానికి పాల్పడ్డారు.
గ్రామంలోని పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇళ్లలో తెలిసి బుద్ధిగా చదువుకోవాలని, ఇలాంటివి మరచిపోవాలని మందలించారు. దీంతో మనోవేదనకు గురై వీరు ఆ గ్రామ శివారు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఏడ్రామి పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. చిన్న పిల్లల చర్య రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది.
షబానా అజ్మికి లైఫ్‌టైమ్ అవార్డు
దొడ్డబళ్లాపురం: 16వ బెంగళూరు అంతర్ రాష్ట్రీయ చలనచిత్రోత్సవంలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు సీనియర్ హిందీ నటి షబానా అజ్మిని వరించింది. 2024–25 వార్షిక 16వ బెంగళూరు అంతర్ రాష్ట్రీయ చలనచిత్రోత్సవంలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఏర్పాటు చేసిన కమిటీ ముగ్గురి పేర్లను సూచించగా, వారిలో షబానాకు అవార్డు దక్కింది. ఈ మేరకు ఎక్స్‌లో సీఎం సిద్ధరామయ్య ఆమెకు అభినందనలు తెలిపారు.
దర్శక, నిర్మాత ముఖానికి మసి
Comments
Please login to add a commentAdd a comment