రాష్ట్ర బడ్జెట్‌పై కదం తొక్కిన కమలదళం
సాక్షి,బళ్లారి: రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య 16వ సారి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. శనివారం జిల్లా బీజేపీ శాఖ, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి బడ్జెట్‌పై నిరసన వ్యక్తం చేశారు. రాయల్ సర్కిల్ వద్ద మానవహారం, ధర్నా చేపట్టి అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన బళ్లారి జిల్లాపై సీఎం శీతకన్ను చూపారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు.
సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి నిధులేవీ?
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నిధులు కేటాయించక పోవడం శోచనీయం అన్నారు. జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారికి సంజీవినిగా మారనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 16 ఏళ్లకు పైగా పూర్తి చేయలేదన్నారు. బడ్జెట్‌లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో విస్తారంగా పండించే మిర్చి పంటకు వ్యాపార కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు ఎన్నో ఏళ్లుగా ఆఽశలు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు గురించి ఊసే లేదన్నారు. ముస్లింలను బుజ్జగించేలా మాత్రమే ఈ బడ్జెట్ ఉందన్నారు. రైతులు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి అన్యాయం చేశారన్నారు.
కొత్త ఇంజినీరింగ్ కళాశాలల ఊసే లేదు
కొత్త ఇంజినీరింగ్ కళాశాలకు నిధుల కేటాయింపు చేయలేదన్నారు. ముఖ్యంగా తుంగభద్ర డ్యాంకు క్రస్ట్‌గేట్లు అమర్చేందుకు నిధుల ప్రస్తావన లేకపోవడం శోచనీయం అన్నారు. నవలి వద్ద సమాంతర జలాశయ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించలేదన్నారు. నాలుగు లక్షల కోట్లు బడ్జెట్ ప్రకటించారు కాని, ఏ వర్గానికి కూడా మేలు చేసే విధంగా లేదన్నారు. గ్యారెంటీలకు నిధులు కేటాయించడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధి పనులపై ఎందుకు లేదని నిలదీశారు. గ్యారెంటీలకు నిధులిచ్చి మిగిలిన వర్గాల వారికి ఎందుకు అన్యాయం చేశారని ప్రశ్నించారు. ఎస్‌సీ, ఎస్‌టీల నిధులు కూడా గ్యారెంటీలకు మళ్లించి ఆ వర్గాల వారి కడుపు కొట్టారన్నారు. పార్టీ జిల్లాధ్యక్షుడు అనిల్ కుమార్, నాయకులు గణపాల్ ఐనాథరెడ్డి, గురులింగనగౌడ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ముస్లింలకు పెద్దపీట వేశారని
మండిపాటు
అన్ని వర్గాలకు అన్యాయం చేశారని ఆగ్రహం
మానవహారం, ర్యాలీలతో పెద్ద ఎత్తున ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment