చింత ధర ఘనం.. దిగుబడులు అఽథమం
సాక్షి,బళ్లారి: చింతతో నిశ్చింత అనే నానుడి రైతన్నలకు అచ్చి రావడం లేదు. మార్కెట్‌లో చింతపండు ధరలు భగ్గుమంటుండగా చెట్లలో మాత్రం కాయలు లేవు. దిగుబడి లేక అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో రైతులు పొలాల వద్ద చింత చెట్లను నాటి పోషిస్తున్నారు. పంటలు సరిగా చేతికందకపోయినా చింత చెట్లు రైతులను ఆదుకునేవి. ఏటా చింత చెట్లు విరగ్గాసి అన్నదాతలకు కాసులు కురిపించేవి. అయితే ఈ ఏడాది చింతచెట్లకు పెద్దగా కాపు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంద చెట్లకుగాను కేవలం పదిచెట్లకు కూడా కాపు రాలేదని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని అన్నదాతలు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో చింతపండు ధర రూ.20 వేల నుంచి రూ.30వేల వరకు పలుకుతోంది. చింతగింజలతో కల్తీ చేసిన చింత పండు కేజీ రూ.200లోపు ఉండగా, మేలురకం చింత పండు కిలో రూ.300 వరకు ధర పలుకుతోందని, ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని, వచ్చే ఏడాది సీజన్ వచ్చే వరకు చింత పండు దొరికే పరిస్థితులు ఉండవని వ్యాపారులు పేర్కొంటున్నారు. చింతచెట్లు ఉన్న తమకు ఎలాంటి ఆధాయం లభించడం లేదని, వ్యాపారులకు మాత్రమే లాభాలు వస్తున్నాయని అన్నదాతలు అంటున్నారు. గత ఏడాది చింత పండును కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ ఉంచిన వ్యాపారులు కూడా మంచి లాభాలు ఆర్జిస్తున్నారని రైతులు అంటున్నారు.
కొండెక్కిన చింత పండు ధరలు
క్వింటాలు రూ.20 వేల నుంచి రూ.30వేల పైమాటే
చింత ధర ఘనం.. దిగుబడులు అఽథమం
Comments
Please login to add a commentAdd a comment