ఆర్థిక వ్యవస్థ దివాలా తీయలేదు | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థ దివాలా తీయలేదు

Published Tue, Mar 18 2025 12:29 AM | Last Updated on Tue, Mar 18 2025 12:26 AM

ఆర్థి

ఆర్థిక వ్యవస్థ దివాలా తీయలేదు

శివాజీనగర: పంచ గ్యారెంటీ పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ దివాలా తీయలేదు. పైగా గ్యారంటీలను బీజేపీ కూడా కాపీ కొట్టింది. రాష్ట్రంలో నిధుల కొరతకు బీజేపీ కారణం. పన్నుల వాటాల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. సోమవారం అసెంబ్లీలో విధానసభలో గ్యారంటీలు, ఆర్థిక వ్యవస్థ తదితరాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. గ్యారెంటీ పథకాలను గట్టిగా సమర్థించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి అనుకూలంగా ఉంది. అభివృద్ధి పథకాలను నిలిపివేయలేదు. ఆర్థికంగా దివాలా తీయలేదు, ఆర్థిక స్థితి పటిష్టంగా ఉందని చెప్పారు. గ్యారెంటీ పథకాలు వాస్తవ రూపం దాల్చడంతో గవర్నర్‌ గెహ్లాట్‌ కూడా మెచ్చుకొన్నారు. పేదల ఆత్మవిశ్వాసం పెరిగింది అని అన్నారు. గ్యారెంటీ పథకాల అమలు వల్ల ప్రభుత్వం దివాలా తీస్తుందని ప్రధాని మోదీతో పాటుగా బీజేపీ నాయకులు ప్రచారం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ కీ గ్యారెంటీ అని కాషాయపార్టీ వారు తమ పథకాలను కాపీ చేశారని కరపత్రాలను చూపిస్తూ హేళన చేశారు. గ్యారెంటీలను మేధావులు, మీడియా, ప్రజలు, విద్యావేత్తలు ప్రశంసించారన్నారు. కేంద్రం నుండి నీటిపారుదల అభివృద్దికి రూ. 10 వేల కోట్లు వచ్చాయని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ అబద్ధాలు చెప్పారన్నారు. 50 సంవత్సరాలకు వడ్డీ రహితంగా ప్రత్యేక సహాయం చేసిందన్నారు.

గ్యారంటీలకు రూ.76 వేల

కోట్లు ఖర్చు

సర్కారు ఏర్పడినప్పటి నుంచి గ్యారెంటీల కోసం ఫిబ్రవరి వరకు సుమారు రూ. 76 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. గ్యారెంటీలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారతీయ ప్రజా పరిపాలనా సంస్థ నివేదిక ఇచ్చిందన్నారు. గ్యారెంటీ పథకాలు ప్రజోపయోగం కాకపోతే బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేస్తున్నారో చెప్పాలన్నారు. పెరుగులో రాళ్లు వెతికే పని చేయకండి అని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారి కూడా పూర్తి మెజారిటీతో అధికారంలో రాలేదు. ఆపరేషన్‌ కమలంతో గద్దెనెక్కిందని సీఎం విమర్శించారు. మీలాగా ఆర్థిక ధనవంతులకు తాము అనుకూలం కాదన్నారు. ప్రధాని మోదీ ఇప్పటివరకు వితంతు, వృద్ధాప్య పింఛన్‌ను ఒక్క రూపాయి కూడా పెంచలేదని ఆరోపించారు.

కరిమణి పదంపై గొడవ

గ్యారెంటీ పథకాల వల్ల పేదలకు లబ్ధి

అసెంబ్లీలో సీఎం సిద్దరామయ్య

కేంద్రం అన్యాయం చేస్తోందని ధ్వజం

ప్రతిపక్షాలు కరిమణి అనడంపై రుసరుస

బీజేపీ పక్ష నేత ఆర్‌.అశోక్‌, ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌లు కరిమణి పదాన్ని వాడి కొన్ని విమర్శలు చేయగా, ఇటువంటి మాటలను తాను ఊహించలేదని సీఎం దుయ్యబట్టారు. ఆర్‌.అశోక్‌ స్పందిస్తూ ప్రతిరోజు పత్రికల్లో మంత్రులు, ముఖ్యమంత్రి మార్పు, డిన్నర్‌ పార్టీలు, ఢిల్లీ భేటీలపై వార్తలు వస్తున్నాయి. అధికార పంపకపు మాటలు వినిపిస్తున్నాయి. మీరొకటి, డీకే శివకుమార్‌ ఒకటి మాట్లాడుతున్నారు. కరిమణి యజమాని ఎవరని మేం అడుగుతున్నాం. బలమైన నాయకత్వం ఉండాలని ఈ విధంగా చెప్పాం. మీకు వద్దనుకుంటే సరే అని అన్నారు. సిద్దరామయ్య మాట్లాడుతూ మీ పార్టీలో విభేదాలు లేవా అని అన్నారు. ఏది ఒప్పో అంతిమంగా ప్రజలు తీర్మానం చేస్తారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆర్థిక వ్యవస్థ దివాలా తీయలేదు1
1/2

ఆర్థిక వ్యవస్థ దివాలా తీయలేదు

ఆర్థిక వ్యవస్థ దివాలా తీయలేదు2
2/2

ఆర్థిక వ్యవస్థ దివాలా తీయలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement