
రూ.5 కోట్లతో అంబేడ్కర్ భవన్ నిర్మాణం
శ్రీనివాసపురం : పట్టణంలో రూ.5 కోట్ల వ్యయంతో అంబేడ్కర్ భవన్‌ను నిర్మిస్తామని ఎమ్మెల్యే జీకే వెంకటశివారెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని తాలూకా కార్యాలయంలో జాతీయ పండుగల ఆచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్ 134వ జయంతి కార్యక్రమంలో భాగంగా అంబేడ్కర్ ప్రతిమకు మాలార్పణ చేసిన అనంతరం మాట్లాడారు. అంబేడ్కర్ గొప్ప మానవతా వాది. దీన దళితుల అభ్యున్నతి కోసం శ్రమించారు. రాజ్యాంగ రచన ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించారన్నారు. ఆయన ఉత్తమ ఆదర్శ వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. తాలూకాలో యువ సముదాయానికి ఉద్యోగాలు లభించాలనే ఉద్దేశంతో పారిశ్రామిక వలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాలూకా ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలకు తమ సహకారం అందించాలన్నారు. టీపీ ఈఓ ఎస్.శివకుమారి, పురసభ అధ్యక్షుడు బీఆర్ భాస్కర్, ముఖ్యాధికారి వి.నాగరాజ్ తదితరులు ఉన్నారు.