![- - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/15/Aadivaasi.jpg.webp?itok=2v16NJiR)
ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో పోలీసులు జరిపిన డ్రోన్ దాడులను ఖండించాలని మావో యిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో సమత ఆదివారం లేఖ విడుదల చేశారు. ఆదివాసీ గ్రామాలైన మెట్టగూడ, ఎర్షన్‌పల్లి, బొట్టెంతోగు గ్రామాల్లోని పొలాలు, ఇళ్ల సమీపాల్లో ఈనెల 13న పోలీసులు డ్రోన్‌ల ద్వారా పెద్ద ఎత్తున బాంబులు వేశారని, నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో పలు చోట్ల పెద్ద ఎత్తున అలజడి సృష్టించారని సమత పేర్కొన్నారు.
ఇలాంటి దాడులను అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక అటవీ ప్రాంతాలపై దాడులు అధికమయ్యాయని, అటవీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను దోచుకునే క్రమంలో అడ్డంకిగా ఉన్న ఆదివాసీలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకే క్యాంపులు ఏర్పాటు చేస్తూ వేల సంఖ్యలో పోలీసులను మోహరింపజేస్తున్నారని ఆరోపించారు. అటవీ సంపదను దోచుకెళ్లేందుకు అడవులను ధ్వంసం చేసి రోడ్లు, సెల్ టవర్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు.
ఆదివాసీ గ్రామాలపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం, అమాయకులను కొట్టడం, జైళ్లల్లో నిర్బంధించడం వంటి దుశ్చర్యలు సరైనవి కావని హితవు పలికారు. బీజాపూర్ జిల్లా మద్వేడి గ్రామంలో పోలీసు కాల్పుల్లో అరు నెలల పాప మృతి చెందగా, ఆమె తల్లికి గాయాలయ్యాయని, వైద్యం పేరుతో అదుపులోకి తీసుకొని జైళ్లో బంధించారని విమర్శించారు. ఈ దాడులన్నీ సీఎం విష్ణుదేవ్‌సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్‌శర్మ ఆదేశాల మేరకు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రజాప్రతినిధులు డ్రోన్ దాడులను ఖండించాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment