
అనుమానాస్పద స్థితిలో ఆటోడ్రైవర్ మృతి
● రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ● పలువురు ఘర్షణ పడినట్లు ఆనవాళ్లు
కొణిజర్ల: అనుమానాస్పద స్థితిలో ఓ ఆటోడ్రైవర్ మృతి చెందిన ఘటన కొణిజర్ల మండలం గోపవరం సమీపాన శనివారం వెలుగుచూసింది. ఎస్‌ఐ జి.సూరజ్, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. చింతకాని మండలం నాగిలిగొండకు చెందిన చాట్ల భిక్షం(45) ఆటోడ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొణిజర్ల సెంటర్ నుంచి చింతకాని మండలం ప్రొద్దుటూరు వరకు నిత్యం ఆటో నడిపే ఆయన శుక్రవారం రాత్రి 9 గంటల సమాయన ఆటోలో ఇంటికి బయలుదేరినట్లు తెలిసింది. అదే సమయాన భిక్షం పెద్ద కుమారుడు శ్రీరామ్ ఫోన్ చేయగా ఒకరిద్దరు ప్రయాణికులు ఎక్కగానే వస్తానని చెప్పినట్లు సమాచారం. అనంతరం 10 గంటల తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోగా.. శనివారం ఉదయం గోపవరం సమీపాన గ్రీన్‌ఫీల్డ్ హైవే పక్కనే సాగర్ కాల్వకట్టపై భిక్షం మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పక్కనే ఆటో ఉండగా గోపవరానికి చెందిన అద్దంకి చిరంజీవి, మంగా చెన్నారావు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు చేరుకుని పరిశీలించగా మృతదేహంపై దెబ్బలు ఉండటం, హైవే పక్కనే మట్టి దిబ్బలపై మద్యం సీసాలు, పెనుగులాడినట్లు గుర్తులు ఉండటంతో భిక్షం సహా పలువురు మద్యం సేవించి ఉంటారని, ఆ తర్వాత ఏదో కారణంతో ఘర్షణ జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఆయన మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయన్న కుటుంబీకుల ఫిర్యాదుతో వైరా ఏసీపీ ఎంఏ రహమాన్, సీఐ సాగర్‌నాయక్, కొణిజర్ల, చింతకాని ఎస్‌ఐలు సాగర్, నాగుల్‌మీరా పరిశీలించి వివరాలు ఆరా తీశారు. మృతుడు గత నెల వరకు ఆటో అడ్డా అధ్యక్షుడిగా పనిచేయగా ఆయనకు భార్య సుజాత, ఇద్దరు కుమారులున్నారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సూరజ్ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో ఆటోడ్రైవర్ మృతి
Comments
Please login to add a commentAdd a comment