భగభగమంటున్న భానుడు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఎండ తీవ్రత నానాటికీ పెరుగుతోంది. అనేక ప్రాంతాల్లో శుక్రవారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైరాలో అత్యధికంగా 40.8 డిగ్రీలుగా నమోదు కాగా, ముదిగొండ, సింగరేణి, సత్తుపల్లి, పెనుబల్లి, రఘునాథపాలెం, ఎర్రుపాలెం, వేంసూరు, మధిర మండలాల్లో దాదాపు అదే పరిస్థితి నెలకొంది. మిగిలిన మండలాల్లో 37.2 – 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9గంటలకే ఎండ మొదలై 11 గంటలకల్లా తీవ్రత పెరుగుతుండడంతో మధ్యాహ్నం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. అలాగే, యాసంగి పంటలు చేతికందుతున్న వేళ ఎండలతో రైతులు, వ్యవసాయ కూలీలు ఇబ్బంది పడుతున్నారు.
కోటాకు మించి విద్యుత్ వినియోగం
ఉష్ణోగ్రతల ప్రభావం విద్యుత్ వినియోగంపై పడింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, ఫ్యాన్ల వినియోగం పెరగగా.. అదే స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోంది. జిల్లాకు కేటాయించే కోటాకు మించి విద్యుత్ వినియోగం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. నిత్యం జిల్లా విద్యుత్ కోటా 6.96 మిలియన్ యూనిట్లు కాగా, మార్చి ఆరంభం నుంచి నిత్యం 9మిలియన్ యూనిట్ల మేర వినియోగం జరుగుతోందని, ఈనెల 2, 4, 7వ తేదీల్లో అత్యధికంగా 9.02 నుంచి 9.09 మిలియన్ యూనిట్లు దాటిందని సమాచారం. గత ఏడాది మార్చి 1 నుంచి 13వ తేదీ వరకు జిల్లాలో 100.68 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించగా, ఈ ఏడాది 115.57 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.
జిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
Comments
Please login to add a commentAdd a comment