
సేంద్రియ వ్యవసాయానికి ప్రభుత్వ ప్రోత్సాహం
ఖమ్మంవ్యవసాయం: సేంద్రియ విధానంలో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో గ్రామ భారతి, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన మెగా ఆర్గానిక్ మేళాను శనివారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పలువురు రైతులు ఇప్పటికే సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతను గుర్తించగా, వినియోగదారులు సైతం ఈ విధానంలో పండిన ఉత్పత్తుల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈనేపథ్యాన ఖమ్మంలో ఆర్గానిక్ మేళా ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధి నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతీనెల రెండో శని, ఆదివారాల్లో మేళా నిర్వహిస్తామని, ఇక్కడ సేంద్రియ విధానంలో సాగుచేసిన కూరగాయలు, దంపుడు బియ్యం, దేశవాళీ ఆవు నెయ్యి, చిరుధాన్యాలు, పసుపు, బెల్లం, తేనె అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు మంజుల, కమర్తపు మురళి, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రమేష్‌రెడ్డి, నారాయణరావు, కుతుంబాక మాధవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment