
● జిల్లాలో పలువురు రైతులది అదే సాగుబాట ● ఏళ్ల క్రితమే
పది ఎకరాల్లోనూ సేంద్రియ సాగే
కామేపల్లి: కామేపల్లి మండలం పింజరమడుగుకు చెందిన నూతలపాటి సత్యనారాయణ పర్యావరణానికి హాని కలగకుండా, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా 12ఏళ్ల నుంచి సేంద్రియ సాగు చేపడుతున్నాడు. సహజ సిద్ధ(ఆర్గానిక్) పంట ఉత్పత్తులకు మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉండడంతో ఆయన వాణిజ్య, ఉద్యాన పంటల సాగులో రాణిస్తున్నాడు. సత్యనారాయణ తనకు ఉన్న పదెకరాల భూమిలో మిర్చి, పత్తి, వరి, ఇతర పంటలను సాగు చేసేవాడు. అయితే, రసాయన ఎరువులు, పురుగు మందులతో ఎదురవుతున్న నష్టం, పెరుగుతున్న పెట్టుబడుల దృష్ట్యా తొలుత కొంత భూమిలో సేంద్రియ సాగు విధానం అవలంబించగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఎకరంలో వరి, మూడెకరాల్లో మిరప సాగు చేస్తూ ఆరు ఎకరాల్లో సీతాఫలం తోట వేశారు. పశువుల ఎరువు, జీవామృతం, వేప, ముష్టి, సీతాఫలం, ఊడుగు ఆకుల కషాయం, వేప పిండి వినియోగించి సొంతంగా కషాయాలను తయారు చేసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే, పంట కోతల తర్వాత మిగిలిపోయిన అవశేషాలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నుతుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని, కలుపు నివారణకు మందులు వాడకుండా కూలీలతోనే తీయిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇంటి పక్కనే ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలోనూ పండ్ల మొక్కలను సత్యనారాయణ నాటారు. నోని, అంజురా, మామిడి, సపోట, పనస, వాటర్ ఆపిల్, జామ, దానిమ్మ, సీతాఫలం, ఆపిల్ బేర్, నిమ్మ, కొబ్బరి, అరటి, ఉసిరి, డ్రాగన్ ఇలాంటివే కాక ఇంట్లో అవసరమయ్యే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉల్లి, ఎల్లిపాయలు, వాము, ధనియాలు కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సేంద్రియ సాగుకు అవసరమైన కషాయం వంటివి సిద్ధం చేసుకోవడం కాస్త కష్టంగా ఉన్నా ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతున్నాయని తెలిపారు. అలాగే, రసాయన అవశేషాలు లేని పంటలు పండిస్తున్నాననే తృప్తి ఉందని వెల్లడించారు.

● జిల్లాలో పలువురు రైతులది అదే సాగుబాట ● ఏళ్ల క్రితమే
Comments
Please login to add a commentAdd a comment