తల్లాడ: రసాయన మందులు వాడకుండా ప్రకృతి సిద్ధంగా ఆరేళ్ల నుంచి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన అయిలూరి చిన్న లక్ష్మారెడ్డి. సేంద్రియ విధానంలో వరి సాగు చేయడమే కాక పంటను సొంతంగా తన ఇంట్లోని మిల్లులో ఆడించి విక్రయిస్తున్నారు. ఆయనకు ఉన్న మూడెకరాలకు తోడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని ఖరీఫ్, రబీ సీజన్లలో కుర్నవల్లి ఏటి కింద వరి సాగు చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లో విజయ్‌రామ్, సేవ్ కార్యాలయం నుంచి విత్తనాలు తెచ్చి సాగు చేయగా.. ఆ తర్వాత సొంతంగానే విత్తనాలు రూపొందించుకుంటున్నారు. ఎకరానికి 20 బస్తాల వరకు వరి దిగుబడి సాధిస్తున్న లక్ష్మారెడ్డి వాటిని నేరుగా కాకుండా విత్తనాలుగా, బియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు. బ్లాక్ రైస్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ రకాల్లోని నారాయణ కామిని, బహురూపి, నవారా, కులాకర్, చిట్టి ముత్యాలు, మైసూరు మల్లిక, కుజ్బీ పటాలియా, కాలాబట్టీ(బ్లాక్‌రైస్) వంటివి సాగు చేస్తున్నారు. ఈ పంటల నుంచి ఆసక్తి గల రైతులకు విత్తనాలను కిలో రూ.వంద చొప్పున విక్రయిస్తున్నారు. తన ఇంటి వద్దే ఏర్పాటు చేసుకున్న మిల్లులో వడ్లను మర ఆడించి ముడి బియ్యంగా మారుస్తున్న లక్ష్మారెడ్డి 10 కిలోలు మొదలు 25, 50కిలోల బస్తాలుగా అవసరమైన వారికి అమ్ముతున్నారు. కాగా, ప్రకృతి సిద్ధంగా పండించిన వడ్లను బియ్యంగా మార్చాక కల్తీ లేకుండా విక్రయిస్తుండడంతో లక్ష్మారెడ్డిని సంప్రదిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొదట్లో కాస్త మందకొడిగా విక్రయాలు సాగినా ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు బెంగళూరు వంటి ప్రాంతాలకు సైతం బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. రెడ్ రైస్ కేజీ రూ.100, బ్రౌన్‌రైస్ రూ.90, బ్లాక్ రైస్ రూ.150 చొప్పున అమ్ముతున్నారు. ఈసందర్భంగా లక్ష్మారెడ్డిని పలకరించగా సుభాష్ పాలేకర్ బాటను అనుసరిస్తూ ఆరేళ్లుగా వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. వరి విత్తనాలతో పాటు బియ్యానికి మంచి గిరాకీ ఉందని, నేరుగా పంటను కాకుండా విత్తనాలు, బియ్యంగా విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.
సొంతంగా ఏర్పాటు చేసుకున్న రైస్ మిల్లుతో...
Comments
Please login to add a commentAdd a comment