
సీపీఆర్‌ఎంఎస్‌లో చేరడానికి మరో అవకాశం
● మార్చి 31లోగా నగదు చెల్లిస్తే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు వైద్యసేవలు ● రూ.60 వేలు కడితే రూ.8 లక్షల విలువైన చికిత్స
సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు పరిశ్రమల్లో పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కోలిండియా కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ – నాన్ ఎగ్జిక్యూటివ్ (సీపీఆర్‌ఎంఎస్ – ఎన్‌ఈ)ను అమలు చేస్తోంది. ఇందులో చేరేందుకు గడువును మార్చి 31వరకు పొడిగించారు. ఈ విషయమై కోలిండియా తీసుకున్న నిర్ణయం మేరకు సింగరేణి యాజమాన్యం గత జనవరి 31న ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.8 లక్షల విలువైన వైద్యం
బొగ్గు పరిశ్రమల్లో పనిచేసి రిటైర్డ్ కార్మికులకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాల్సి ఉన్నప్పటికీ నగదు చెల్లించాల్సిదేనని యాజమాన్యాలు స్పష్టం చేయడంతో గతంలో చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే సీపీఆర్‌ఎంఎస్ – ఎన్‌ఈను 2019లో అమల్లోకి తీసుకొచ్చారు. తొలినాళ్లలో రూ.10 వేలు కడితే ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో చికిత్స అందేది. ఆ తర్వాత రూ.40 వేలకు పెంచి రూ.8 లక్షల విలువైన చికిత్స చేయించడానికి అంగీకారం కుదిరింది. అయితే, సకాలంలో చాలా మంది సభ్యులుగా చేరకపోవడంతో మరో రూ.20 వేలు పెంచి రూ.60 వేలు కట్టడానికి మార్చి 31 వరకు గడువు పొడిగించారు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా..
బొగ్గుగనుల్లో పనిచేసే సమయాన కార్మికులు అనారోగ్యం బారిన పడితే ఏరియా, ప్రధానాస్పత్రుల్లో వైద్యసేవలు అందుతాయి. అయితే విరమణ అయ్యాక వీరికి ఉచితంగా వైద్యసేవలు ఇవ్వలేమని చెబుతూ సీపీఆర్‌ఎంఎస్ కార్డ్‌ను ప్రవేశపెట్టారు. ఏటా లైవ్ సర్టిఫికెట్ సమర్పించి.. దీనిని రెన్యూవల్ చేసుకుంటే సుమారు 156 ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించేలా నిర్ణయించారు. కాగా, హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల్లో కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ కార్డ్ చూపిస్తే ఎలాంటి షరతులు లేకుండా వైద్యసేవలు అందిస్తారని సింగరేణి యాజమాన్యం చెబుతోంది. ఇందుకోసం సింగరేణి భవన్‌లో ప్రత్యేకాధికారిని సైతం నియమించారు. కానీ, కొన్ని ఆస్పత్రులు మెరుగైన సేవలందిస్తుండగా.. మరికొన్ని చోట్ల మాత్రం నామమాత్రపు సేవలు అందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకోవడం ఇలా..
సీపీఆర్‌ఎంఎస్‌లో చేరేందుకు మూడు సెట్ల దరఖాస్తులు, రిటైర్డ్ ఉద్యోగి, భార్య, నామినీవి ఐదు చొప్పున ఫొటోలు, ముగ్గురివి మూడేసి ఆధార్ కార్డు కాపీలతో పాటు కంపెనీలో తొలగించిన నాటి లేఖ, బ్యాంకు ఖాతా పుస్తకం కలర్ జిరాక్స్ మూడు సెట్లు సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాక చివరి నెల వేతనం జిరాక్స్, రిటైర్డ్ ఉద్యోగి దంపతుల పాన్‌కార్డులు కూడా జత చేయాలి. ఒకవేళ దివ్యాంగులైన పిల్లలు ఉంటే మరో రూ.20 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఏరియా వారీగా పరిశీలిస్తే ఇప్పటివరకు కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో 1,642 మంది, కొత్తగూడెం ఏరియాలో 2,761, మణుగూరు ఏరియాలో 2,248, ఇల్లెందు ఏరియాలో 1,369 మంది రిటైర్డ్ ఉద్యోగులు కార్డుల కోసం నగదు చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment