
మున్సిపల్ సేవలను వినియోగించుకోవాలి
వైరా: వేసవి కాలంలో ప్రజల సౌకర్యార్ధం మున్సిపాలిటీ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన చలివేంద్రాలను వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. వైరాలోని ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను గురువారం ఆమె ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ ఉద్యోగులతో సమావేశమైన అదనపు కలెక్టర్ ఈనెలాఖరు నాటికి వంద శాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చింతా వేణుతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.
జమలాపురం ఆలయ హుండీ ఆదాయం రూ.32.86లక్షలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. ఖమ్మం కమాన్‌బజార్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, జమలాపురం ఆలయ ఈఓలు కె.వేణుగోపాలచార్యులు, కె.జగన్మోహన్‌రావు ఆధ్వర్యాన చేపట్టిన లెక్కింపులో 91 రోజులకు గాను రూ.32,86315 ఆదాయం నమోదైంది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, సిబ్బందితో పాటు శ్రీసత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
‘విద్యానిధి’కి
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే వారికి ఆర్థిక సాయం అందించేలా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారా యణ తెలిపారు. యూఎస్‌ఏ, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పీజీ కోర్సులు చేసే వారికి ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. కుటుంబంలో ఒకరికే వర్తించే ఈ పథకం కోసం 35ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు వచ్చేనెల 19లోగా తెలంగాణ ఈపాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలకు మించొద్దని, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ, జీమ్యాట్, పీటీఈలో అర్హత సాధించి.. విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ప్రవేశం పొందిన వారు అర్హులని వెల్ల డించారు. పూర్తి సమాచారం కోసం కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని డీడీ సూచించారు.
ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ పేరిట వసూళ్లు
● రూ.50వేల మేర జమ చేయించుకున్న గుర్తుతెలియని వ్యక్తి
సత్తుపల్లి: షాపు ట్రేడ్ లైసెన్స్ గడువు తీరినందున రెన్యూవల్ చేసుకోకపోతే జరిమానా పడుతుందని దబాయిస్తూ ఓ వ్యక్తి చేసిన ఫోన్‌లో సత్తుపల్లిలోని పలువురు వ్యాపారులు హడలిపోయారు. ఈమేరకు కొందరు వ్యాపారులు లైసెన్స్ రెన్యూవల్ చేయాలని ఫోన్ చేసిన వ్యక్తిని కోరగా.. ఆయన ఓ ఫోన్ నంబర్ ఇచ్చి ‘నీరజ్‌గుప్తా’ పేరు వస్తుందని అని చెబుతూ రూ.2వేలు ఫోన్‌పే చేయాలని సూచించాడు. అలా చేశాక సమయం దాటినందున రూ.570 జరిమానా చెల్లించాలని, ఆపై రూ.500 తిరిగి వస్తాయంటూ నమ్మబలికినట్లు తెలిసింది. దీంతో సత్తుపల్లికి చెందిన పలువురు రూ.50వేల మేర చెల్లించినట్లు తెలిసింది. ఈ విషయం విస్తృతంగా ప్రచారం కావడంతో మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ స్పందించారు. ట్రేడ్‌లైసెన్స్ లైసెన్స్ కోసం ఎవరూ ఫోన్ చేయరని స్పష్టం చేశారు. ఎలాంటి లావాదేవీలైన వార్డు ఆఫీసర్ స్వయంగా వస్తారని, లేదంటే వ్యాపారులే కార్యాలయానికి రావాలని సూచించారు. కాగా, అపరిచిత వ్యక్తి చేసిన ఫోన్ కాల్‌తో తాము రూ.2,570 చెల్లించానని వ్యాపారి రాయల నరేంద్రకుమార్, తదితరులు తెలి పారు. ఆతర్వాత మోసపోయినట్లు తెలిసిందని వాపోయారు.

మున్సిపల్ సేవలను వినియోగించుకోవాలి