
సన్నాలు పక్కదారి పట్టకుండా..
● బియ్యం పంపిణీపై అధికార యంత్రాంగం నిఘా ● షాపుల్లో రోజువారీ తనిఖీ, నివేదికలు
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల నుంచి రేషన్‌షాపుల ద్వారా కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. జిల్లాలో 748 రేషన్ దుకాణాలు ఉండగా, 4.10,988 కార్డులకు గాను 11,48,031మంది లబ్ధిదారులకు బియ్యం అందజేయాల్సి ఉంది. ఇందుకోసం 7,200మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే షాప్‌లకు చేరవేశారు. అయితే, ఇన్నాళ్లు దొడ్డుబియ్యం కావడంతో షాపులకు రాని వారు కూడా సన్నబియ్యం తీసుకునేందుకు బారులు దీరుతున్నారు. ఈనేపథ్యాన ఎక్కడా బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు నిఘా పెంచారు.
ప్రతీరోజు తనిఖీలు
ఎక్కడ కూడా సన్నబియ్యం పక్కదారి పట్టొదన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రోజువారీగా రేషన్ షాప్‌ల్లో తనిఖీ చేస్తున్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ స్వయంగా పలు షాపులను పరిశీలిస్తుండగా, సివిల్ సప్లయీస్ డీటీలతోపాటు తహసీల్దార్లు సైతం తమ పరిధిలోని షాప్‌లను సందర్శిస్తున్నారు. గతంలో మాదిరి ఎవరైనా బియ్యం తీసుకోకపోతే డీలర్లు ఇతరులకు అధిక ధరతో అమ్ముకునే అవకాశం ఏర్పడుతుందనే భావనతో ఈ తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. షాప్‌కు కేటాయించిన బియ్యం, రోజువారీ పంపిణీ, మిగిలిన స్టాక్ వివరాలు నమోదు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు సమాచారం.
దందాకు చెక్‌పెట్టేలా..
గతంలో అక్రమార్కులతో కలిసి కొందరు డీలర్లు చేతులు కలిపి దొడ్డు బియ్యం చేరవేసేవారు. అంతేకాక ఎవరైనా కార్డుదారులు బియ్యం వద్దంటే వారికి డబ్బు ఇస్తూ ఆ బియ్యాన్ని పక్కదారి పట్టించడం చోటు చేసుకుంది. ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యాన అలా జరగకుండా దందాకు చెక్ పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఉద్యోగులు ముమ్మరంగా తనిఖీలు చేపడు తూ నిఘాను పటిష్టం చేశారు.
బియ్యంలో తరుగు
నేలకొండపల్లి: పేదలకు ప్రభుత్వం రేషన్‌షాప్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో అక్కడక్కడా తరుగు వస్తోంది. ఇన్నాళ్లు దొడ్డుబియ్యం కావడంతో ఎంత ఇచ్చినా పట్టించుకోని లబ్ధిదారులు.. ఇప్పుడు మాత్రం డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తమకు గోదాం నుంచే తరుగుతో వస్తున్నాయని, కాంటా కూడా వేయడం లేదని డీలర్లు వాపోతుండడం గమనార్హం. ఇటీవల నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కార్డుదారులు బియ్యం తీసుకుని మరోచోట కాంటా వేయించారు. ఇందులో ఓ కార్డుదారుడికి 18 కిలోలకు గాను అర కేజీ తక్కువగా వచ్చాయి. ఇదే పరిస్థితి చాలా చోట్ల ఉండడంతో డీలర్లను నిలదీస్తున్నారు. కానీ తమకు బియ్యం కేటాయించే క్రమాన మండల స్థాయి స్టాక్ పాయింట్ వద్ద కాంటా వేయడం లేదని.. చేసేదేం లేక తాము తక్కువగా ఇస్తున్నామని డీలర్లు వాపోతున్నారు. ఈ విషయమై నేలకొండపల్లి తహసీల్దార్ జె.మాణిక్‌రావ్‌ను వివరణ కోరగా... కారణాలు ఏమైనా కార్డుదారులకు ఇచ్చే బియ్యంలో గింజ కూడా తగ్గొద్దని, అలా జరిగితే డీలర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాక గోదాంల వద్ద బియ్యం బస్తాలు కాంటా వేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు..
దుకాణాలు తనిఖీ చేస్తున్నాం
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఈక్రమంలో ఎక్కడా బియ్యం పక్కదారి పట్టకుండా తనిఖీలు చేస్తున్నాం. షాపుల్లో పరిశీలిస్తూ స్టాక్ వివరాలు నమోదు చేయించడమే కాక ప్రతిరోజు జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు నివేదికలు పంపిస్తున్నాం.
– చందన్‌కుమార్,
జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి, ఖమ్మం

సన్నాలు పక్కదారి పట్టకుండా..

సన్నాలు పక్కదారి పట్టకుండా..