
సీఎం దృష్టికి సైలోబంకర్ సమస్య
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలంలోని సింగరేణి సైలో బంకర్ ద్వారా వెలువడుతున్న కాలుష్యంతో వ్యాధుల బారిన పడుతున్నామని కిష్టారం గ్రామస్తులు తరచుగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈనేపథ్యాన హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మంగళవారం కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి – దయానంద్ దంపతులు సమస్యను వివరించి డీఎంఎఫ్‌టీ నిధులపై వినతిపత్రం అందజేశారు. ఈమేరకు సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతానని సీఎం హామీ ఇచ్చారని వారు తెలిపారు.
పంట నష్టం
నమోదు చేయండి
వైరారూరల్: ఇటీవల అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న తదితర పంటల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సూచించారు. వైరా మండలం పూసలపాడులో మంగళవారం పర్యటించిన ఆయన వర్షాలతో నేలకొరిగిన వరి పైర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే, వివరాల నమోదుపై ఉద్యోగులకు సూచనలు చేశారు. కాగా, ఏఓ మయాన్ మంజూఖాన్ గొల్లపూడిలో పంటలను పరిశీలించగా, అకాల వర్షానికి సుమారు 500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అంచనా ఉందని తెలిపారు. ఏఈఓలు అయిలూరి వాసంతి, బాదావత్ సైదులు, మేడా రాజేష్, వెంకటనర్సయ్య, కీర్తి పాల్గొన్నారు.
ప్రత్యేక అధికారుల
నియామకం
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక, రాజీవ్ యువవికాసం దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపికను పర్యవేక్షించేందుకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. ఈమేరకు జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ శ్రీజ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం నియోజకవర్గానికి జెడ్పీసీఈఓ దీక్షారైనా, పాలేరుకు ఎస్‌డీసీ ఎం.రాజేశ్వరి, మధిరకు జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, వైరాకు డివిజనల్ పంచాయతీ అధికారి టి.రాంబాబు, సత్తుపల్లి నియోజకవర్గానికి ఆర్‌డీఓ ఎల్.రాజేందర్‌గౌడ్ ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు.
ఇందిరమ్మ లబ్ధిదారురాలికి తొలి ఫలం
కొణిజర్ల: రాష్ట్రప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, కొణిజర్ల మండలం చిన్నగోపతి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ గ్రామంలో 52 మందికి గృహాలు మంజూరు చేయగా, వారిలో 43 మంది బేస్‌మెంట్ లెవల్ వరకు నిర్మాణం పూర్తిచేశారు. ఈమేరకు హైదరాబాద్‌లో నియోజకవర్గానికి ఇద్దరేసి లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి చెక్కులు అందజేశారు. ఇందులో చిన్నగోపతికి చెందిన లింగాల నీలిమ కూడా వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌తో కలిసి చెక్కు అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఇల్లు మంజూరు కావడం, సీఎం చేతుల మీదుగా తొలి విడత చెక్కు అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
ముగిసిన మూల్యాంకనం
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఈనెల 7వ తేదీన మొదలైన పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం మంగళవారంతో ముగిసింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 2,34,456 జవాబుపత్రాలను మూల్యాంకనం చేసినట్లు డీఈఓ సోమశేఖరశర్మ, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రమేష్ తెలిపారు. విధుల్లో వెయ్యి మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారని వెల్లడించారు.
పకడ్బందీగా
రేషన్‌కార్డుల సర్వే
చింతకాని: నూతన రేషన్‌కార్డులు, కుటుంబీకుల పేర్లు చేర్చేందుకు అందిన దరఖాస్తుల ఆధారంగా సర్వే పకడ్బందీగా పూర్తిచేయాలని డీఎస్‌ఓ చందన్‌కుమార్ ఆదేశించారు. చింతకానిలో సర్వే మంగళవారం ఆయన పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. అర్హులందరికీ కొత్త కార్డులు అందుతాయనే భరోసా కల్పించాలని తెలిపారు. ఆర్‌ఐలు రఘు, జయకృష్ణ పాల్గొన్నారు.

సీఎం దృష్టికి సైలోబంకర్ సమస్య