
పాడి రైతుల సంక్షేమానికి కృషి
● పాల ధర పెంపు, ఎప్పటికప్పుడు చెల్లింపులు ● రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ అమిత్‌రెడ్డి
ఖమ్మంవ్యవసాయం: పాల ఉత్పత్తిదారుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ(విజయ డెయిరీ) చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తెలిపారు. ఖమ్మంలో గురువారం రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పాల బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు చెల్లించడమేకాక గేదె పాల ధరను లీటర్‌కు రూ.5 పెంచామని తెలిపారు. అనంతరం ఇందిరా మహిళా డెయిరీ సభ్యులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో సంఘాలను ఏర్పాటుచేసుకుని, సేకరించిన పాలను విజయ డెయిరీకి పంపిస్తున్నామని తెలిపారు. అనంతరం చైర్మన్ విజయ డెయిరీలోని వివిధ విభాగాలను పరిశీలించి డిప్యూటీ డైరెక్టర్ పి.మోహనమురళితో చర్చించారు. సంస్థ జనరల్ మేనేజర్ మధుసూదన్‌రావు, అడిషనల్ డీఆర్‌డీఓ నూరుద్దీన్, పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా చైర్మన్ కె.నాగేశ్వరరావు, మేనేజర్ మురళీకృష్ణ, ఉద్యోగులు నాగమణి, హనుమంత్, కృష్ణ, అనితకుమారి, నాగశ్రీ, శ్రీలత, అప్పారావు, వి.మురళీకృష్ణ, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఖమ్మం వీడీవోస్ కాలనీలోని సమీకృత మార్కెట్‌లో ఏర్పాటు చేసిన విజయ డెయిరీ పార్లర్‌ను చైర్మన్ అమిత్‌రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, పువ్వాళ్ల దర్గా ప్రసాద్, దొబ్బల సౌజన్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.