● క్షుద్రపూజల పేరిట అమాయకులను మోసగిస్తున్న కేటుగాళ్లు ●
2018 మే 13న కౌటాల ఉమ్మడి మండలంలోని గిన్నెలహెట్టి గ్రామానికి చెందిన మీసాల గంగారం(50)ను మంత్రాలు చేశాడనే నెపంతో హత్య చేశారు. తన భర్త మరణానికి గంగరాం మంత్రాలే కారణమని ఇట్యాల మల్లక్క భావించింది. ఈ విషయం తన కుమారుడు తిరుపతికి చెప్పగా, అతడు గ్రామంలోని పోల్కె సిద్దయ్య, పొల్కె భిక్షపతి, గుర్లె చంద్రశేఖర్‌తో కలిసి గంగరాంకు మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న గంగారాం మెడకు చున్నీతో బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని గ్రామ సమీపంలోని చెట్ల పొదల్లో పడేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే 15 ఏళ్ల క్రితం చింతలమానెపల్లి మండలం బాలజీఅనుకోడ గ్రామంలో బాలిక, వృద్ధురాలి మెడను కోసి గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేసిన ఘటన అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంచనం సృష్టించింది.
కౌటాల(సిర్పూర్): ఆధునికాలంలో సాంకేతికత అభివృద్ధి చెందింది. అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) రాకతో ప్రతిరోజూ సంచలనాలు నమోదవుతున్నాయి. అయితే సమాజంలో మూఢనమ్మకాలు మాత్రం పూర్తిగా తొలగిపోవడం లేదు. గ్రామాలు, పట్టణాలు అని తేడాలేకుండా కొందరు మాయలు, మంత్రాలను నేటికీ విశ్వసిస్తున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అమాయక ప్రజలు సమస్యల పరిష్కారానికి మంత్రగాళ్లు, బాబాలను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు.. ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకుంటున్న కేటుగాళ్లు వారిని మరింత కష్టాల్లోకి నెడుతున్నారు. మరికొందరైతే బరితెగించి మీ ఇంటి, ఆరోగ్య సమస్యలకు చేతబడే కారణమని విద్వేషం రగిలిస్తున్నారు. ఫలితంగా తెలిసిన వారిపై దాడులకు తెగబడుతున్నారు.
మారుమూల ప్రాంతాల్లో గుప్తనిధుల వేట..
మారుమూల మండలాలైన కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్, దహెగాం, తిర్యాణి, సిర్పూర్(టి) ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడుతున్నారు. కొన్నేళ్లుగా అటవీ ప్రాంతాలు, పురాతన ఆలయాలు, గుట్టల వద్ద రాత్రిపూట గుప్తునిధులు ఉన్నాయని తవ్వకాలు జరుపుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరచూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అమావాస్య రోజులు, ఇతర మంచిరోజులు అంటూ కొంత మంది గుప్తనిధుల తవ్వకాలు జరుపుతున్నారు. అమాయక ప్రజలకు కూడా మాయమాటలు చెప్పి రూ.లక్షల నగదు లాగుతున్నారు. పలానా చోట బంగారం దొరికిందని, తక్కువ సమయంలో డబ్బు సంపాదించవచ్చని చెబుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు. సరిహద్దులోని మహారాష్ట్ర నుంచి బాబాలను పిలుపించుకుని రాత్రిపూట తవ్వకాలు జరుపుతున్నారు. రెండు తలల పాములు, తాబేళ్లను వేటాడిస్తున్నారు. నిధుల వేటలో విచక్షణ కోల్పోయిన వ్యక్తులే ఇటీవల బెజ్జూర్ మండలంలో సమాధిని తవ్వి మృతదేహం ఎముకలు ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. మద్యం మత్తులో ఉండటంతో వారు ఎంతకై నా తెగిస్తున్నారు.
అవగాహన లేక దాడులు
ప్రజల బలహీనతను ఆసరా చేసుకుని దొంగ స్వాములు, భూతవైద్యులు నిలువు దోపిడీకి తెగబడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం, అక్షరాస్యత తక్కువగా ఉండడం, గిరిజన జనాభా అధికంగా ఉండటంతో కొంతమంది మూఢ నమ్మకాలను పెంచిపోషిస్తున్నారు. ఇంట్లో సమస్యలు, అశాంతి, ఆర్థిక సమస్యలకు చేతబడులు కారణమ ని నమ్మిస్తున్నారు. మూఢ నమ్మకాలతో మునిగిపోయిన వారు సొంత వారిపైనే దాడులకు దిగుతున్నారు. చేతబడి నెపంతో మానవత్వాన్ని బంధాలు మరిచి ప్రాణాలు తీయడానికి వెనుకడడం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51(ఏహెచ్) ప్రకారం ప్రజల్లోని మూఢనమ్మకాలు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అయితే అధికారులు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
అవగాహన కల్పిస్తున్నాం
అమాయక ప్రజలను మూఢనమ్మకాల పేరిట ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆధునిక కాలంలో ప్రజలు ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మొద్దు. గుప్తనిధుల తవ్వకాలపై ప్రజలు డయల్ 100కి సమాచారం అందించాలి. జిల్లాలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శనల ద్వారా మూఢవిశ్వాసలపై అవగాహన కల్పిస్తున్నాం.
– డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ
● క్షుద్రపూజల పేరిట అమాయకులను మోసగిస్తున్న కేటుగాళ్లు ●
Comments
Please login to add a commentAdd a comment