
● ఈ నెల 10 నుంచి నిలిచిన సీసీఐ కొనుగోళ్లు ● జిన్నింగు మ
ఆసిఫాబాద్‌అర్బన్/కౌటాల: పత్తి రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆధార్ సర్వర్ సమస్య తలెత్తడంతో ఈ నెల 10 నుంచి జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు నిలిచిపోయాయి. రైతుల ఆధార్ అథెంటికేషన్‌లో ఏర్పడిన అంతరాయం కారణంగా కొనుగోళ్లు నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే మళ్లీ ఎప్పటినుంచి పునరుద్ధరిస్తామనే దానిపై ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. ఆధార్ సర్వర్ పునరుద్ధరణ తర్వాతే కొనుగోళ్లు చేపట్టే అవకాశం ఉంది. సీసీఐ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 17లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు.
18 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో 3.50 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి పంట సాగైంది. జిల్లాలో పత్తి కొనుగోళ్ల కోసం జిన్నింగ్ మిల్లుల్లో 18 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెద్దపులుల సంచారం, కూలీల కొరత కారణంగా ఈ ఏడాది పత్తితీత పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. కొందరు రైతులు పూర్తి పంటను ఒకేసారి అమ్మాలని మొదటి, రెండు విడతల్లో తీసిన పత్తిని కూడా ఇళ్లలోనే నిల్వ చేసుకున్నారు. విరామం అనంతరం సోమవారం పత్తిని విక్రయించేందుకు రైతులు శని, ఆదివారం నుంచే సీసీఐ కేంద్రాల వద్ద బారులు తీరారు. వాహనాలు అద్దెకు మాట్లాడుకుని వచ్చా రు. తీరా ఈ నెల 10 నుంచి ఆధార్ సర్వర్‌లో అంతరాయం ఏర్పడింది.
జిన్నింగ్ మిల్లుల వద్ద బారులు
నిబంధనల ప్రకారం తేమ శాతం, నాణ్యత ఉంటే మద్దతు ధర రూ.7,521 చెల్లించాల్సి ఉంది. అయితే ప్రైవేట్ వ్యాపారులు నాణ్యత పేరు చెప్పి రూ.6,500 కూడా చెల్లించడం లేదు. దీంతో రైతులు మూడు, నాలుగు రోజులుగా జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇందులో చాలా మందికి సొంత వాహనాలు లేవు. ప్రైవేట్ వాహనాలను రోజుకు రూ.1000, అంతకంటే ఎక్కువే అద్దె చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కొనుగోళ్లు నిలిచిపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోలేక.. సీసీఐ కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించడంతో నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. కిరాయి తడిసిమోపెడవుతుందని, అధికారులు స్పందించి తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
కౌటాలలో సైతం..
కౌటాలలోని జిన్నింగ్ మిల్లులో సీసీఐ కేంద్రంలో వారం రోజుల అనంతరం పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావడంతో వందలాది వాహనాలు వచ్చాయి. రెండు కిలోమీటర్ల మేర మొగడ్‌దగడ్ చౌరస్తా వరకు వాహనాలు బారులు తీరాయి. రోజుల తరబడి క్వింటాళ్ల పత్తి లోడ్ చేసి ఉండటంతో కొందరు రైతులు ఇళ్లకు వెళ్లిపోయారు. రహదారి వెంబడి నిలిపి ఉన్న వాహనాల నుంచి సామగ్రి, పత్తిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. రోడ్డుపై ఒకవైపు పూర్తిగా పత్తి వాహనాలు ఉండటంతో మొగడ్‌దగడ్, వీర్థండి, తాటినగర్, భాలేపల్లి, గుండాయిపేట, తుమ్మిడిహెట్టి గ్రామాల నుంచి కౌటాలకు వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు.

● ఈ నెల 10 నుంచి నిలిచిన సీసీఐ కొనుగోళ్లు ● జిన్నింగు మ
Comments
Please login to add a commentAdd a comment