ఉత్పత్తితోపాటు రవాణా ఎంతో కీలకం
● సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి చేపడుతున్న బొగ్గు ఉత్పత్తికి సమానంగా సకాలంలో వినియోగదారులకు అందేలా రవాణా చేయడం కూడా సంస్థకు ఎంతో కీలకమని సింగరేణి సీఎండీ బలరాంనాయక్ అన్నారు. బెల్లంపల్లి ఏరియాలో బుధవారం రాత్రి పర్యటించారు. ఇటీవల నూతనంగా సింగరేణి డైరెక్టర్లుగా నియామకమైన డైరెక్టర్ (పీఅండ్‌పీ) కె.వెంకటేశ్వర్లు, డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్‌వీ సూర్యనారాయణలతో కలిసి గోలేటి సీహెచ్‌పీని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ గోలేటి సీహెచ్‌పీ బొగ్గు రవాణాలో ముందంజలో కొనసాగుతోందన్నారు. సింగరేణిలోనే ఆదర్శంగా నడుస్తున్న గోలేటి సీహెచ్‌పీని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సకాలంలో వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందించినప్పుడే సంస్థకు మంచిపేరు వస్తుందని అన్నారు. వినియోగదారుల నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దన్నారు. గోలేటి సీహెచ్‌పీలో మహిళా ఉద్యోగులు పురుషులతో సమానంగా అన్నిరకాల విధులు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం కై రిగూడ ఓసీపీని సందర్శించారు. ఓసీపీకి నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రోజులను సద్వినియోగం చేసుకుని, రోజువారీ ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచుకుంటూ వందశాతం ఉత్పత్తిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ఎస్‌వోటూ జీఎం రాజమల్లు, ప్రాజెక్టు అధికారి నరేందర్, పీఈ వీరన్నతో పాటు అన్నివిభాగాల అధికారులు పాల్గొన్నారు.
రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలి
శ్రీరాంపూర్: ప్రతీ ఉద్యోగి విధి నిర్వహణలో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధనకు కృషి చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్ అన్నారు. బుధవారం ఆయన నూతన డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ(ఆపరేషన్స్), కే.వెంకటేశ్వర్లు(ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్)తో కలిసి శ్రీరాంపూర్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఆర్కే 5, ఆర్కే 6, ఆర్కే 7, శ్రీరాంపూర్ ఓసీపీ, సీహెచ్‌పీలను సందర్శించి కా ర్మికులు, ఉద్యోగులతో మాట్లాడారు. ఆర్కే న్యూ టెక్ గనిలో స్వయంగా దిగి పని స్థలాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక నుంచి మహిళా ఉద్యోగులు అన్ని కేటగిరీల్లో పని చేయడానికి సిద్ధంగా ఉండాలని, భూగర్భంలో కూడా దిగి పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇక నుంచి ఈపీ ఆపరేటర్లుగా కూడా వెళ్లడానికి అవకాశం ఉందన్నారు. సంస్థ కల్పిస్తున్న అవకాశాలను మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సంస్థ ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి దిశగా ముందుకెళ్తోందని తెలిపారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు.
ట్రెయినీ ఎఫ్‌ఎస్‌వోల క్షేత్రపర్యటన
పెంచికల్‌పేట్/బెజ్జూర్: హైదరాబాద్‌లోని దూలపల్లి అటవీ శిక్షణ కేంద్రానికి చెందిన ట్రెయినీ సెక్షన్ అధికారులు బుధవారం పెంచికల్‌పేట్, బెజ్జూర్ మండలాల్లో పర్యటించారు. అకాడమీ డైరెక్టర్ ఎఫ్‌ఆర్‌వో రామ్మోహన్ ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణకు చేపడుతున్న చర్యల గురించి తెలుసుకున్నారు. పెంచికల్‌పేట్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాలు, పాలరాపు గుట్ట వద్ద రాబందుల స్థావరంతోపాటు బెజ్జూర్ రేంజ్ పరిధిలోని ముత్తడి స్ప్రింగ్ ఆనకట్ట, గడ్డి మైదానం, మాణికదేవర అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. వారి వెంట ఎఫ్‌ఎస్‌వో జగన్‌మోహన్, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రావణ్‌కుమార్, బీట్ అధికారులు గోపాల్, వెంకటేశం, బేస్‌క్యాంప్ సిబ్బంది ఉన్నారు.
ఉత్పత్తితోపాటు రవాణా ఎంతో కీలకం
Comments
Please login to add a commentAdd a comment