ఎన్నికల నిర్వహణలో అధికారులదే కీలకపాత్ర
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో స్టేజ్ 1, 2 అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీపీవో భిక్షపతిగౌడ్‌లతో కలిసి కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్‌లోని స్టేజ్– 1, 2 అధికారులు, సిబ్బందితో వేర్వేరుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అధికారులు సమన్వయంతో పారదర్శకంగా నిర్వహించాలన్నారు. విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది శిక్షణను ఏకాగ్రతతో నేర్చుకోవాలని, ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలించాలని సూచించారు. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడువు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం స్టేజ్– 1, 2 అధికారులను నియమించిందని తెలిపారు. స్టేజ్– 1 అధికారులు నామినేషన్లు స్వీకరించడం, పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు వివాదాలు లేకుండా పూర్తిచేయాలని ఆదేశించారు. విధులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. స్టేజ్– 2 అధికారులు పోలింగ్, అదనపు పోలింగ్ అధికారులతో కలిసి ఎన్నికలు నిర్వహించడం, లెక్కింపు ప్రక్రియ చేయాలన్నారు. ఎన్నికల సామగ్రి కవర్లు, డైరీలపై అవగాహన ఉండాలని సూచించారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరికీ ఆధార్ తప్పనిసరి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని ప్రతిఒక్కరూ ఆధార్ కార్డు పొందాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ చైతన్య కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ సభ్యులతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ కార్డు అవసరమన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు సుమారు 36,679 మంది ఉన్నారని, వీరందరికీ ఆధార్ నమోదుకు జిల్లా సంక్షేమ శాఖ, విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలు ఆధార్ నమోదు సేవలు ఉచితంగా పొందవచ్చని, 15 ఏళ్లు దాటిన వారు మానిటరింగ్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలన్నారు. గతంలో ఆధార్ కోసం ఈఐడీఎస్ తిరస్కరణ గురైన వివరాలు సేకరించి యుఐడీఏఐ కార్యాలయం హైదరాబాద్‌కు పంపించాలన్నారు. ఆసరా పింఛన్‌దారులు, ఉపాధిహామీ పథకం కూలీలు, వేలిముద్రలు పడనివారు వివరాలు అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో మెగా క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, ముఖ్య ప్రణాళిక అధికారి కోటయ్య, డీటీడీవో రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, ఈ– డిస్ట్రిక్ మేనేజర్ గౌతమ్‌రాజ్, తపాలశాఖ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment