మళ్లీ ఎప్పుడో..?
● అల్బెండజోల్ మాత్రల పంపిణీ వాయిదా ● జిల్లాలో 1.96 లక్షల మంది విద్యార్థులు
కెరమెరి(ఆసిఫాబాద్): నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 10న చేపట్టాల్సిన అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లల్లో నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఒకసారి, 17న మరోసారి పిల్లలకు మాత్రలు వేయాలని అధికారులు నిర్ణయించారు. ఏఎన్‌ఎంలు, ఇతర వైద్యసిబ్బందికి శిక్షణ కూడా కల్పించారు. ఆ తర్వాత అనివార్య కారణాలతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
1.96 లక్షల మంది గుర్తింపు
జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఎంతమంది పిల్లలు ఉన్నారనే వివరాలు సేకరించి, అందుకు అనుగుణంగా అల్బెండజోల్ మాత్రల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు ఈ ఏడాది 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 1.96 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. జనవరిలోనే అన్ని గ్రామాల్లోని ఉప కేంద్రాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అక్కడి నుంచి జిల్లా వైద్యశాఖ కార్యాలయానికి నివేదిక అందించారు. మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు వారికి అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రలు వేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఆరు నుంచి 15 ఏళ్ల లోపు వారికి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, 16 నుంచి 18 ఏళ్ల వారికి కళాశాలల్లో, ఏడాది నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు ఇంటివద్దే మాత్రలు వేయాలని నిర్ణయించారు. వయస్సు ఆధారంగా ఎంత మోతాదులో మాత్ర వేయాలని శిక్షణ కల్పించారు. మళ్లీ పంపిణీ ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.
ఆదేశాలు రాలేదు
నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రల పంపిణీపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. జిల్లా వ్యాప్తంగా మాత్రల పంపిణీకి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉంది.
– సీతారాం, డీఎంహెచ్‌వో
జిల్లా వివరాలు
మళ్లీ ఎప్పుడో..?
Comments
Please login to add a commentAdd a comment