ఇంకా రోడ్లపైనే నిరీక్షణ..
కౌటాల(సిర్పూర్): ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మకానికి రైతులకు కష్టాలు తప్పడం లేదు. కౌటాలలోని జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి విక్రయించేందుకు వచ్చిన రైతులు ఆధార్ సర్వర్ మొరాయించడంతో రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. వారం రోజుల అనంతరం పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఈ నెల 10 నుంచి వందలాది పత్తి వాహనాలు జిన్నింగ్ మిల్లు నుంచి రెండు కిలోమీటర్ల దూరం నిలిచి ఉన్నాయి. మొగడ్‌దగడ్ చౌరస్తా వరకు రోడ్డు వెంబడి వాహనాలను క్యూలో ఉంచారు. ఐదు రోజులుగా రైతులు రాత్రంతా జాగారం చేస్తున్నారు. శుక్రవారం కూడా భారీగా వాహనాలు క్యూకట్టాయి. గత్యంతరం లేక కొంతమంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు పత్తి విక్రయించి వెళ్లిపోతున్నారు.
దళారుల దోపిడీ..
సీసీఐ కేంద్రాల్లో సర్వర్ మొరాయించడంతో రో జుల రైతులు తరబడి పడిగాపులు కాస్తున్నారు. వాహనాలకు అధిక చార్జీలు చెల్లించలేకపోతున్నా రు. కొంతమంది లోడ్ చేసిన వాహనాలు వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. ఇదే అదునుగా భావించిన దళారులు రైతుల ఇళ్లలో నిల్వ ఉంచిన పత్తిని తక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. లైసెన్స్ ఉన్న వారితోపాటు అనేక మంది లైసెన్స్ లేకున్నా ఇష్టారాజ్యంగా కాంటాలు ఏర్పాటు చేస్తున్నారు. క్వింటాల్‌కు రూ.6500 వరకు చెల్లించి రాత్రికి రాత్రే మహారాష్ట్రకు తరలిస్తున్నారు.
దొంగల చేతివాటం..
కౌటాల సీసీఐ కేంద్రం వద్ద రోజుల తరబడి పత్తి బండ్లు నిలిపి ఉండగా, రైతులకు దొంగల బెడద వేధిస్తోంది. వాహనాల నుంచి రాత్రి పూట దొంగలు వాహన సామగ్రి, బ్యాటరీలు, పత్తిని కూడా ఎత్తుకెళ్తున్నారు. బారులుదీరిన వాహనాలతో ఇతర వాహనదారులకు రాకపోకలు కష్టంగా మారాయి. ట్రాక్టర్లలో పత్తి తెచ్చిన రైతులు ట్రాలీని అక్కడే వదిలేసి ఇంజన్లు తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు.
పత్తి అమ్మకానికి రైతులకు అరిగోస
దొంగల బెడదతోనూ తీవ్ర నష్టం
తక్కువ ధరకు కొంటున్న ప్రైవేట్ వ్యాపారులు
Comments
Please login to add a commentAdd a comment