గిరిజన రైతుల ఆందోళన
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం తిర్యాణి మండలం మంగీ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబండ గ్రామానికి చెందిన గిరిజన రైతులు ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ మాట్లాడుతూ గిరిజన రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. ఎర్రబండ గ్రామానికి చెందిన రైతులు 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు రెవెన్యూ అధికారులు గతంలో పట్టా మంజూరు చేశారని తెలిపారు. ప్రస్తుతం మండలానికి వచ్చిన తహసీల్దార్ వారి పట్టాలు రద్దు చేసినట్లు తెలపడంతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఫిర్యాదు చేసిన సమయంలో 15రోజుల్లో విచారణ చేపట్టి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయినా రెవెన్యూ అధికారులు నోటీసులు పంపుతున్నారని తెలిపారు. గిరిజన రైతులకు న్యాయం చేయని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గొడిసెల కార్తీక్, టీకానంద్, కృష్ణమాచారి, తిరుపతి, నిర్వాసిత రైతులు జంగు, బాజీరావ్, ఆత్రం ఆత్మరావ్, దేవ్, సోయం చిత్రు, మాంకు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment