సొసైటీ పాలకవర్గాల గడువు పెంపు
● మరో ఆరు నెలల వరకు అవకాశం
కైలాస్‌నగర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాల గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 14తో పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల మాదిరిగానే సొసైటీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలనను అమలు చేస్తారనే చర్చ సాగింది. అయితే తమ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి విన్నవించారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్లకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఉత్తర్వులు అందజేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతో పాటు 77 సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు మరో ఆరు నెలల పాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment