శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నియమించిన ఆర్వోలు, సహాయ ఆర్వోలకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలిసి హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సంబంధిత అధికారులు ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలన్నారు. అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉప సంహరణ, అభ్యర్థుల తుది జాబితా, గుర్తుల కేటాయింపు, పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ దీపక్ తివారి
Comments
Please login to add a commentAdd a comment