అందని ద్రాక్షే!?
వందేభారత్..
● జిల్లా మీదుగా నాగ్‌పూర్– సికింద్రాబాద్ మధ్య నిత్యం పరుగు.. ● రెండు జిల్లాల పరిధిలో ఎక్కడా ఆగదు.. సీట్లు నిండవు ! ● ఐదు నెలలుగా ఆక్యుపెన్సీ 33 శాతమే... ● బోగీలు కుదించే యోచనలో రైల్వే శాఖ ● హాల్టింగ్‌లు పెంచాలంటున్న ప్రయాణికులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వందేభారత్ రైలు జిల్లా రైలు ప్రయాణికులకు అందని ద్రాక్షగానే మారింది. నిత్యం మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా నాగ్‌పూర్–సికింద్రాబాద్ మార్గంలో పరుగులు పెడుతోంది. అయితే ఈ సూపర్‌ఫాస్ట్ రైలులో ప్రయాణించాలని ఆశపడిన జిల్లావాసుల కల మాత్రం నెరవేరడం లేదు. ఇతర రైళ్లతో పోలిస్తే చార్జీలు ఎక్కువగా ఉన్నా... రెండు జిల్లాల్లో ఎక్కడా స్టాప్‌లు లేకపోవడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. నిత్యం రద్దీగా ఉండే నాగ్‌పూర్–సికింద్రాబాద్ మార్గంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు రిజర్వేషన్లు కూడా బుక్ కావడం లేదు. నిత్యం వందల మంది ప్రయాణికులు సికింద్రాబాద్‌వైపు వస్తుంటారు. అయితే వందేభారత్‌ను వినియోగించుకునే అవకాశం లేదు.
నిత్యం రాకపోకలు..
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా వాసులు నాగ్‌పూర్ వరకు వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలతోపాటు వార్దాలో ఆసుపత్రి, చంద్రాపూర్ వరకు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ వందేభారత్ రైలు ఎక్కే అవకాశం లేదు. ప్రస్తుతం అందుబాటులో నిజాముద్దీన్–ఢిల్లీ రాజధాని 12437 వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్, కేఎస్‌ఆర్ బెంగళూరు సిటీ నుంచి ఢిల్లీ నిజాముద్దీన్ 22691రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, నాగ్‌పూర్ వైపు.. దక్షిణ్, జీటీ, తెలంగాణ, దానాపూర్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. వీక్లీ స్పెషల్‌గా నడిచే 21 రైళ్లు వారంలో ఒక రోజు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ రైళ్లన్నీ రిజర్వేషన్లతోనే నిండిపోతాయి. సికింద్రాబాద్, చైన్నె, ఆంధ్రా, కర్ణాటక నుంచి నడిచే ఈ రైళ్ల రిజర్వేషన్ భోగీలతోపాటు జనరల్ కంపార్టుమెంట్స్‌లోనూ కాలు పెట్టే జాగా ఉండదు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లోనూ కాజీపేట, నాగ్‌పూర్ మధ్య ఎలాంటి కొత్త రైళ్ల ప్రతిపాదన కూడా లేదు. ఈ క్రమంలో స్థానికుల ప్రయాణం కోసం వందేభారత్ రైలుకు హాల్టింగ్ ఇస్తే, ఇటు కాజీపేట, సికింద్రాబాద్, అటు బల్లార్షా, మహారాష్ట్రవైపు రాకపోకలు సాగించే వారికీ ఉపయుక్తంగా ఉంటుంది. రైల్వేకు ఆదాయం పెరుగుతుంది.
ఖాళీగానే సీట్లు.. బోగీల కుదింపు
నాగ్‌పూర్–సికింద్రాబాద్ రైలును గత సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొత్తం 20 కోచ్‌లతో ప్రారంభమైన ఈ రైలును ఐదు నెలలుగా ప్రయాణికులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రయాణికులు లేక చాలా వరకు సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కోచ్‌లను కుదించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈనెల 19 నుంచే కోచ్‌లను తగ్గించి నడిపిస్తారని సమాచారం.
వందేభారత్ రైలు
ఐదు నెలల్లో వందేభారత్ సగటు ఆక్యుపెన్సీ (సీట్ల భర్తీ)శాతం
అక్కడ అలా...
మహారాష్ట్రలో చంద్రాపూర్, బల్లార్షాకు మధ్య దూరం కేవలం 14 కిలోమీటర్లే. అయినా అక్కడ రెండు హాల్టింగ్‌లు ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తర్వాత బల్లార్షా వరకు ఎక్కడా హాల్టింగ్ లేదు. రామగుండం నుంచి బల్లార్షా మధ్య సుమారు వంద కిలోమీటర్లకుపైగానే దూరం ఉంటుంది. కానీ, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, సిర్పూర్(టి)లో ఎక్కడా హాల్టింగ్ ఇవ్వడం లేదు. కోచ్‌లు కుదించాలన్న ఆలోచన విరమించుకుని మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌లో వందే భారత్‌లో హాల్టింగ్ ఇవ్వాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా విన్నవిస్తున్నా రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. హాల్టింగ్ లేనిఫలితంగా వందేభారత్ వెలవెలబోతోంది. దీంతో రైల్వేకు కూడా నష్టం వాటిల్లుతోంది. గడిచిన ఐదు నెలల్లో కేవలం 33 శాతం ఆక్యుపెన్సీతోనే నడుపుతున్నారు. దీంతో బోగీలు తగ్గించాలని రైల్వే శాఖ భావిస్తోంది.
ఈ ప్రాంతంపై చిన్నచూపు...
సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలుకు మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ స్టేషన్లలో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతున్నా రైల్వే శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. తక్కువ ఆక్యుపెన్సీ నష్టాలతో నడిపించే బదులు స్టాప్‌లు కల్పించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తే ఉపయోగపడుతుంది. రైల్వేకు ఆదాయం పెరుగుతుంది.
– అంకిత్ ఫణిశర్మ,
అధ్యక్షుడు, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం
అందని ద్రాక్షే!?
Comments
Please login to add a commentAdd a comment