‘ఉపాధి’లో పనిభారం
● ఈజీఎస్ పథకంలో సిబ్బంది కొరత
● ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై పనిభారం
● క్షేత్రస్థాయిలో తగ్గుతున్న పర్యవేక్షణ
తిర్యాణి(ఆసిఫాబాద్): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ పథకం కింద పేద కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉంది. జిల్లాలో ఇప్పటికే 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్ష్యానికి మించి పనిదినాలు కల్పించారు. క్షేత్రస్థాయిలో అవసరానికి అనుగుణంగా సిబ్బందిని నియమించకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పడుతోంది.
ఏడుగురు మాత్రమే ఈసీలు
జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా 1.23 లక్షల కుటుంబాలు జాబ్‌కార్డు కలిగి ఉన్నాయి. ఇందులో 2.43 లక్షల మంది కూలీల పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రసుత్తం 91 వేల యాక్టీవ్ జాబ్ కార్డుల్లో 1.70 లక్షల మంది కూలీలు నిత్యం పనుల కు వెళ్తున్నారు. జిల్లాలోని 15 మండలాలు ఉండగా, ఒక్కో మండలానికి ఒక్కో ఈసీ(ఇంజినీరింగ్ కన్సల్టెంట్)ని నియమించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఏడుగురు ఈసీలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈసీలు లేనిచోట టెక్నికల్ అసిస్టెంట్లకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టే పనుల్లో ఈసీల పాత్ర ఎంతో కీలకమైంది. పనులకు నిర్వహణ సంబంధించిన మ్యాపింగ్‌తో పాటు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అంతేకాకుండా టెక్నికల్ అసిస్టెంట్లు చేసిన ఎంబీ రికార్డులపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది.
పర్యవేక్షకులేరి..?
మండలస్థాయి పర్యవేక్షకులైన ఏపీవో(అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి) పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 15 మంది ఏపీవోలు పనిచేయాల్సి ఉండగా 12 మంది మాత్రమే ఉన్నారు. ఏపీవోలు లేనిచోట టీఏలకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఖాళీలుగా ఉన్న ఏపీవో, ఈసీ పోస్టుల్లో టీఏ(టెక్నికల్ అసిస్టెంట్)లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో వారిపై పనిభారం అధికం అవుతోంది. సాధారణ విధులతోపాటు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. దీనికి తోడు కొత్త పంచాయతీలు ఏర్పాటు కావడంతో ఒక్కో టీఏ దాదాపు పది పంచాయతీల్లో చేపడుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఉమ్మడి పంచాయతీల వారీగా ఎఫ్‌ఏలు
ఉపాధిహామీ పనుల నిర్వహణలో క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ల(ఎఫ్‌ఏ) పాత్ర కీలకం. జిల్లాలో 335 పంచాయతీలకు ప్రస్తుతం కేవలం 150 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ మూడు, నాలుగు గ్రామాల్లో ఏకకాలంలో పనులు చేయిస్తున్నారు. నూతన పంచాయతీల వారీగా ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించి, పనులపై పర్యవేక్షణ పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని సిబ్బంది చెబుతున్నారు. ఖాళీలు భర్తీ చేసి పనిభారం తగ్గించాలని వారు వేడుకుంటున్నారు.
పనిభారం పెరుగుతోంది
జిల్లాలో సరిపడా ఫీల్డ్ అసిస్టెంట్లు లేరు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై పనిభారం పెరుగుతుంది. ఒక్కో ఏఫ్‌ఏ మూడు నుంచి నాలుగు పంచాయతీల్లో పనులను చూసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించాలి. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారిపై పనిభారం తొలగించాలి. – బోయిరే రమేశ్,
ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
‘ఉపాధి’లో పనిభారం
Comments
Please login to add a commentAdd a comment