విధుల్లో నలుగురే..! | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నలుగురే..!

Published Mon, Feb 17 2025 12:16 AM | Last Updated on Mon, Feb 17 2025 12:13 AM

విధుల్లో నలుగురే..!

విధుల్లో నలుగురే..!

● జిల్లాలోని గ్రంథాలయాల్లో 12 పోస్టులు ఖాళీ ● 1994 తర్వాత పోస్టుల భర్తీ ఊసే లేదు..! ● ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్న వైనం ● సరిపడా సిబ్బంది లేక అవస్థలు

వాంకిడి(ఆసిఫాబాద్‌): విజ్ఞానాన్ని అందించే లైబ్రరీలపై పట్టింపు కరువైంది. దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలో 1994లో నియామకమైన వారినే కొనసాగిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రత్యేక భవనాలు లేకపోవడం.. సరిపడా సిబ్బందిని నియమించకపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలోని గ్రేడ్‌– 1, గ్రేడ్‌– 2 గ్రంథాలయాల్లో మొత్తం 16 మంది ఉండాల్సి ఉండగా.. కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ నలుగురే జిల్లాలోని తొమ్మిది గ్రంథాలయాలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తుండటంతో గ్రంథాలయ సిబ్బందిని భర్తీ చేసి, పుస్తకాలు, పత్రికలు అందుబాటులో ఉంచితే గ్రామాల్లోని నిరుద్యోగ యువతపై ఆర్థికభారం తగ్గుతుంది.

భవనాలు కరువు..

జిల్లావ్యాప్తంగా ఉన్న తొమ్మిది గ్రంథాలయాల్లో జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ లైబ్రరీకి మాత్రమే పక్కా భవనం ఉంది. అది కూడా ఇటీవలే నిర్మించారు. అన్ని సౌకర్యాలతో నిర్మించడంతో పట్టణ పాఠకులు, నిరుద్యోగులకు అది వరంలా మారింది. మిగతా గ్రంథాలయాలకు ఇప్పటివరకు పక్కా భవనాల నిర్మాణం చేపట్టలేదు. నిధులు లేక కొన్ని, స్థలాలు లేక మరికొన్ని పక్కా భవనాలకు నోచుకోవడం లేదు. పాతబడిన ప్రభుత్వ భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగిస్తున్నారు. కొత్త మండలాల్లో గ్రంథాలయాల మంజూరు ఊసే లేకుండా పోయింది. విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గ్రామీణ యువకులకు అందుబాటులోకి తీసుకురావాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అదనపు ఇన్‌చార్జి బాధ్యతలు చేపడుతుండటంతో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.

పట్టణాలకు వెళ్తే అదనపు భారం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఉన్నత విద్యకు ప్రవేశ పరీక్షలు కూడా వేసవిలోనే ఉన్నాయి. విద్యార్థులు, యువత పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. పట్టణాల్లో కోచింగ్‌లకు వెళ్తే వేల రూపాయలు అవసరం ఉంటుంది. దీంతో పేద నిరుద్యోగ యువకులు గ్రంథాలయాలనే ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడంతో నిరుద్యోగులు మరింత పట్టుదలతో చదువుకుంటున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రంథాలయాల్లోనే ఉంటున్నారు. సరైన వసతులు లేకున్నా ఇన్‌చార్జీల సహకారంతో పుస్తకాలు తెప్పించుకుని సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో మొత్తం 74 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిత్యం 500 నుంచి 600 మంది పాఠకులు, ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారు వస్తుంటారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉండటంతో అతితక్కువ మార్కులతో ఉద్యోగాలు చేజార్చుకున్న వారు, నూతనంగా ప్రిపేర్‌ అయ్యేవారు అధికంగా గ్రంథాలయాల బాట పడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటే పేద, మధ్య తరగతికి చెందిన యువకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

సిబ్బంది కొరత..

జిల్లాలోని పాత మండలాల్లో గ్రంథాలయాలు నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్‌లో గ్రేడ్‌– 2 గ్రంథాలయం ఉండగా మిగితా అన్నీ గ్రేడ్‌– 3 గ్రంథాలయాలే. వీటిలో పని చేసేందుకు లైబ్రేరియన్లు, రికార్టు అసిస్టెంట్లు, అటెండర్లు మొత్తం 16 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం జిల్లాలో నలుగురు లైబ్రేరియన్లు మాత్రమే పనిచేస్తున్నారు. పాత మండలాల్లో దహెగాం, తిర్యాణి, బెజ్జూర్‌ మండలాలకు గ్రంథాలయాల మంజూరైనా ఇప్పటివరకు అక్కడ ప్రారంభించలేదు. దీనికి అసలు కారణాలేంటనేది కూడా ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఉన్న తొమ్మిది గ్రంథాలయాల్లోనూ సిబ్బంది లేరు. సౌకర్యాలు కరువై పాఠకులు, నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌటాల, సిర్పూర్‌(టి), జైనూర్‌, సిర్పూర్‌(యూ), వాంకిడి మండలాల గ్రంథాలయాలు ఇన్‌చార్జీలతోనే కొనసాగుతున్నాయి. కెరమెరిలో పార్ట్‌టైం ఉద్యోగి లైబ్రేరియన్‌గా కొనసాగుతున్నారు. చివరిసారిగా 1994లో సిబ్బంది నియామకం చేపట్టారు. అప్పటి నుంచి నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. దశాబ్దాలుగా సిబ్బంది కొరతతో లైబ్రరీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గ్రేడ్‌– 2 లైబ్రేరియన్‌ 1, గ్రేడ్‌– 3 లైబ్రేరియన్లు 5, రికార్డు అసిస్టెంట్లు ఆసిఫాబాద్‌లో 1, సిర్పూర్‌(టి) 1, అటెండర్లు 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement