ప్రతిష్టంభన తొలగేదెన్నడో..
● ఐదేళ్ల క్రితం నిలిచిన సింగరేణి సీఎండీ స్థాయి సమావేశాలు ● పరిష్కారానికి నోచుకోని కార్మికుల ప్రధాన సమస్యలు ● పిలుపు కోసం గుర్తింపు సంఘం ఎదురుచూపు
శ్రీరాంపూర్: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశాలపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రధాన డిమాండ్ సాధనకు వేదిక అయిన ఈ సమావేశం ఐదేళ్లుగా నిర్వహించడం లేదు. గత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ హయాం నుంచి ఈ సమావేశాలకు బ్రేక్ పడింది. నాడు ప్రభుత్వ పెద్దలే నిర్ణయాలు తీసుకునేవారు. ప్రధాన డిమాండ్లు కూడా వారే పరిష్కరించేవారు. దీంతో సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశానికి ప్రాధాన్యం తగ్గింది. దీనిని నిర్వహించాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. గతేడాది గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన ఏఐటీయూసీ అన్ని స్థాయిల్లో స్ట్రక్చరల్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో యాజమాన్యం ఏరియాల వారీగా జీఎం లెవల్ స్ట్రక్చరల్ సమావేశాలు నిర్వహిస్తోంది. 2024 నవంబర్ 28న డైరెక్టర్(పా) లెవల్ స్ట్రక్చరల్ సమావేశం కూడా జరిగింది. ఇందులో కొన్ని డిమాండ్లపై అంగీకారం కుదిరినా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రధానమైన డిమాండ్లను సీఎండీ లెవల్ స్ట్రక్చరల్ సమావేశంలో చర్చించాల్సి ఉంది. ఈ సమావేశం ఏర్పాటు చేస్తే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరాలని గుర్తింపు సంఘం నాయకులు భావిస్తున్నారు. కానీ యాజమాన్యం మాత్రం సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశం నిర్వహణకు ఆసక్తి చూపడం లేదు.
ప్రధాన డిమాండ్లు...
కార్మికులకు కోలిండియాలో మాదిరిగా పెర్క్స్‌పై ఆదాయ పన్నును యాజమాన్యమే చెల్లించాలనే డిమాండ్ చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. కా ర్మికుల సొంత ఇంటి పథకం, మారు పేర్లతో పనిచేసే వారి పేర్లను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్ పరిష్కారం కావడం లేదు. గైర్హాజరు పేరుతో డిస్మిస్ చేసిన వారికి మరో అవకాశం కల్పిస్తూ తిరిగి ఉ ద్యోగాలు ఇవ్వాలని, ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పనులు కాంట్రాక్టర్లతో కాకుండా కంపెనే చేపట్టాలని, కాంట్రాక్ట్ కార్మికులకు జీవో 22 అమలు చేసి వేతనాలు చెల్లించాలని, కోడ్ ఆఫ్ డిసిప్లేన్‌ను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లను సీఎండీ లెవల్ స్ట్ర క్చరల్ సమావేశాల్లో చర్చించి పరిష్కరించుకోవాల్సి ఉందని ఏఐటీయూసీ నేతలు పేర్కొంటున్నారు.
కోడ్ కారణమా..?
డైరెక్టర్(పా) లెవల్ సమావేశం జరిగిన నెలకే సీఎండీ లెవల్ సమావేశం విధిగా జరగాల్సి ఉంది. కానీ కంపెనీ నిర్వహించడం లేదు. ఇప్పటికీ మూడుసార్లు సీఎండీ లెవల్ సమావేశాలు పెట్టడానికి అధికారులు నిర్ణయించి రద్దు చేశారు. చివరికి ఈ నెల మొదటి వారంలో ఉంటుందని భావించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సమావేశం మరోమారు వాయిదా వేసినట్లు తెలిసింది. ఇన్నాళ్లూ సమావేశం నిర్వహించకుండా.. ఇప్పుడు కోడ్ పేరుతో కావాలనే అధికారులు జాప్యం చేస్తున్నారని గుర్తింపు కార్మిక సంఘం నేతలు పేర్కొంటున్నారు.
కోడ్ సాకుతో కావాలనే జాప్యం
ఎన్నికల కోడ్‌కు సింగరేణి స్ట్రక్చరల్ సమావేశాలకు సంబంధం లేదు. 25 ఏళ్ల నుంచి సింగరేణిలో స్ట్రక్చరల్ సమావేశాలు జరుగుతున్నా ఏనాడు ఎన్నికల కోడ్‌తో సమావేశాలు ఆపలేదు. ఇప్పుడు యాజమాన్యం కావాలనే జాప్యం చేస్తోంది. రెగ్యులర్ ప్రాసెస్‌గా జరిగే ఈ సమావేశాలకు కోడ్ అడ్డంకి కాదు. సత్వరమే సీఎండీ లెవల్ స్ట్రక్చరల్ సమావేశం నిర్వహించి పెండింగ్‌లో ఉన్న ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలి.
–వి.సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment