ప్రత్యేక కిట్లు.. బోధన మెరుగు
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మండలాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేశారు. అలాగే విడతల వారీగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్‌పీ)లు పంపిణీ చేసి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. తాజాగా విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా బోధించేందుకు సర్కారు బడులకు ప్రత్యేక కిట్లు అందజేస్తున్నారు. బడుల్లో వినోదంతో కూడిన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రత్యేకంగా కిట్లు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే తొలి మెట్టు, ఉన్నత పాఠశాలలో ఉన్నతి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అయినా విద్యార్థుల్లో అశించిన స్థాయిలో సామర్థ్యాలు మెరుగుపడటం లేద నే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐఐటీల ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక బోధన ఉపకరణాల కిట్లను ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేశారు. ఇటీవల ఉపాధ్యాయులకు కిట్లపై అవగా హన కల్పించి కిట్లు అందించారు. సాధారణ తరగతి బోధనతో విద్యార్థులు విసుగు చెందే అవకా శం ఉంది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఎఫ్‌ఎల్‌ఎం కింద వండర్ బాక్సులు, ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల కు గణిత, సైన్స్ కిట్లు పంపిణీ చేశారు. ప్రాథమి కోన్నత పాఠశాలలకు ఎఫ్‌ఎల్‌ఎన్ వండర్ బాక్సుల్లో ప్రధానంగా కథలు పొందుపరిచారు. పరికరాలు చూపుతూ బోధిస్తుండటంతో విద్యార్థులకు సులభంగా పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయి.
పాఠశాలలకు కిట్లు సరఫరా
జిల్లావ్యాప్తంగా డీఈవో పరిధిలోని 702 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2024– 25 విద్యా సంవత్సరంలో 38 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. డీఈవో పరిధిలో ఉన్న 702 పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నవాటికి మొదట ప్రాధాన్యం ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా 105 ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎఫ్‌ఎల్‌ఎన్ వండర్ బాక్సులు, 15కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)కు గణిత, సైన్స్ క్యూరియాసిటీ బాక్సులు సరఫరా చేశారు. 11 ఉన్నత పాఠశాలలకు 11 ఖోజీ కిట్లు అందజేయగా, వీటిల్లో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించిన పరికరాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు ఆయా పరికరాలకు సమర్థవంతంగా వినియోగించుకుని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
సమర్థవంతంగా వినియోగించాలి
విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మొదట ఎంపిక చేసిన పాఠశాలలకు ప్రత్యేక కిట్లు అందించాం. వండర్ బాక్స్‌లను ఉపాధ్యాయులు సమర్థవంతంగా వినియోగించాలి. వీటిని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలి. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు కృషి చేయాలి.
– శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్
ప్రభుత్వ పాఠశాలలకు బోధన ఉపకరణాలు అందజేత
వినోదంతో కూడిన విద్యనందించేందుకు చర్యలు
విద్యా సామర్థ్యాల పెంపే లక్ష్యం..
ప్రత్యేక కిట్లు.. బోధన మెరుగు
Comments
Please login to add a commentAdd a comment