‘రేషన్’ మాఫియా!
● సరిహద్దు దాటుతున్న పీడీఎస్ బియ్యం ● జిల్లాలో రెచ్చిపోతున్న అక్రమార్కులు ● దందాకు అధికారులే సహకరిస్తున్నారా..? ● రైస్ మిల్లులు, రేషన్ డీలర్ల పాత్రపై అనుమానాలు
చింతలమానెపల్లి(సిర్పూర్): పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వాలు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నా యి. అయితే ఈ బియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. జిల్లాలో రేషన్ బియ్యం దందా ఓ మాఫియాగా మారుతోంది. అన్ని ప్రాంతాల్లో దళారులను ఏర్పాటు చేసుకుని అధికారులకు మామూళ్లు చెల్లిస్తూ అక్రమ దందాను విస్తరించారు. మొదట్లో చిన్నస్థాయిలో మొదలైన ఈ తంతు నేడు బడా వ్యాపారంగా మారింది. తాజాగా సిర్పూర్(టి) మండలం హుడ్కిలి వద్ద పోలీసులు వాహనాల్లో ఏకంగా 208 క్వింటాళ్ల బియ్యం పట్టుకోవడం సంచలనంగా మారింది. చింతలమానెపల్లి మండలం బాలాజీఅనుకోడ, డబ్బా, ఖర్జెల్లి, గూడెం, దిందా, కౌటాల మండలం ముత్తంపేట, బోదంపల్లి, కౌటాల, గుండాయిపేట, సిర్పూర్(టి) మండలం హుడ్కిలి, వెంకట్రావుపేట, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు, బెజ్జూర్, దహెగాం, పెంచికల్‌పేట్ మండలాల్లోని సరిహద్దు గ్రామాలు, కాగజ్‌నగర్ పట్టణం ఈ దందాకు కీలకంగా ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ఏడాది వ్యవధిలో పదుల సంఖ్యలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులు నమోదు కావడం గమనార్హం. బియ్యం అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చాడని కాగజ్‌నగర్ పట్టణంలో ఓ యువకుడిపై దాడికి పాల్పడి గాయపర్చడం మాఫియా ఆగడాలను తీరును తెలియజేస్తోంది.
రేషన్ డీలర్లు, మిల్లర్ల పాత్ర..?
రేషన్ బియ్యం అక్రమ దందాలో రేషన్ డీలర్లు, మిల్లర్ల పాత్రపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్, పోలీసులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. దళారుల నుంచి రేషన్ బియ్యం రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పలుమార్లు జిల్లావ్యాప్తంగా రైస్‌మిల్లుల్లో భారీగా రేషన్ బియ్యం సంచులు పట్టుబడ్డాయి. రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసిన రేషన్ బియ్యం పాలిషింగ్ చేసి సన్నబియ్యంగా మార్చి మార్కెట్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బియ్యాన్ని నాణ్యమైన బ్రాండ్‌ల పేరుతో ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు పట్టుబడిన రేషన్ బియ్యం సంచుల్లో కొన్ని ప్రభుత్వ ముద్ర ఉన్న రేషన్ సంచులు ఉండడం అధికారులను విస్మయానికి గురి చేసింది. రేషన్ డీలర్ల పాత్ర లేకుండా ఈ సంచులు నేరుగా వ్యాపారుల వద్దకు ఎలా చేరుకుంటాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
‘మామూళ్ల’ మత్తు!
పేదలకు అందాల్సిన బియ్యం అక్రమంగా మహా రాష్ట్రకు చేరవేయడంలో అధికారుల మామూళ్ల వ్యవహారం కూడా ఉండడం గమనార్హం. సిర్పూర్(టి) మండలంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులపై ఆరోపణలు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించే పోలీసు, రెవెన్యూ అధికారుల వ్యవహారంపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. తాజాగా జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. విచారణ చేస్తారనే సమాచారం గతంలో మామూళ్ల తీసుకున్న వారికి ఇబ్బందిగా మారుతోంది. ఎక్కడ తమ వ్యవహారం బయటకు పొక్కుతుందో అనే ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
అక్రమంగా మహారాష్ట్రకు..
తెలంగాణ, మహారాష్ట్రకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దుగా ఉంది. కాగజ్‌నగర్, సిర్పూర్(టి)ల మీదుగా మహారాష్ట్రకు నేరుగా రైలు మార్గం ఉంది. వాంకిడి, సిర్పూర్(టి) మండలం హుడ్కిలి, వెంకట్రావుపేట, చింతలమానెపల్లి మండలం గూడెం మీదుగా మహారాష్ట్రకు రోడ్డు మార్గాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న బియ్యానికి మహారాష్ట్రలో డిమాండ్ ఉంది. స్థానికంగా లబ్ధిదారుల నుంచి రూ.10 నుంచి రూ.12లకు కిలో బియ్యం కొనుగోలు చేస్తున్నారు. అనంతరం అక్రమంగా మహారాష్ట్రకు తరలించి అక్కడ రూ.25 నుంచి రూ.30లకు విక్రయిస్తున్నారు. దళారుల నుంచి కొనుగోలు చేసిన బడా వ్యాపారులు నేరుగా మహారాష్ట్రకు చేరవేస్తున్నారు. గతంలో మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, తాండూర్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన, కాగజ్‌నగర్, సిర్పూర్(టి) ప్రాంతాల రైల్వేస్టేషన్ల నుంచి భారీస్థాయిలో తరలించేవారు. రైల్వే, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహించి రైళ్లలో అక్రమ రవాణాను నియంత్రించారు. ఇటీవల దళారులు నేరుగా గ్రామాల్లో కొనుగోలు చేస్తుండడంతో వ్యాపారులు ఎక్కువగా మహారాష్ట్రకు రోడ్డు మార్గంలో బియ్యం తరలిస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటున్నాం
బియ్యం అక్రమ దందాపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పట్టుబడిన వారిని బైండోవర్ చేస్తున్నాం. మళ్లీ పట్టుబడితే చట్టప్రకారం బైండోవర్ అనంతరం చర్యలు తీసుకుంటాం. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించి, అక్రమ రవాణాను నిరోధించేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. చెక్‌పోస్టుల్లో మామూళ్ల ఆరోపణలపై సిబ్బందిపై గతంలో చర్యలు తీసుకున్నాం. అధికారుల పాత్రపై విచారణ జరుగుతోంది. అధికారుల పాత్రపై నిజాలు బయట పడితే త్వరలో చర్యలు ఉంటాయి.
– రాణాప్రతాప్, టాస్క్‌ఫోర్స్ సీఐ
‘రేషన్’ మాఫియా!
Comments
Please login to add a commentAdd a comment