చికెన్ అమ్మకాలు డౌన్!
కౌటాల(సిర్పూర్): చికెన్ అమ్మకాలపై బర్డ్ ఫ్లూ ప్రభావం పడింది. జిల్లాలో చాలామంది ఆదివారం కూడా మాంసం కొనేందుకు వెనుకడుగు వేశారు. బర్డ్‌ఫ్లూ కారణంగానే చికెన్ అమ్మకాలు తగ్గినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం చేపలు, మటన్, నాటుకోడి కొనేందుకు ఆసక్తి చూపారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలతోపాటు ఆయా మండలాల్లో హోల్‌సెల్, రిటైల్ చికెన్ దుకాణాలు దాదాపు 300లకు పైగా ఉన్నాయి. ప్రతిరోజూ జిల్లావ్యాప్తంగా దాదాపు 200 క్వింటాళ్లకు పైగా విక్రయాలు జరిగేవి. కానీ బర్డ్‌ఫ్లూ కారణంగా కొనుగోళ్లు సగానికి పైగా తగ్గినట్లు వ్యాపారులు వాపోతున్నారు.
విందు భోజనాల్లో మటనే..
శుభ ముహూర్తాలు ఉండటంతో జిల్లావ్యాప్తంగా పెళ్లిళ్లు జోరందుకున్నాయి. పెళ్లి భోజనాలపైనా బర్డ్‌ఫ్లూ ప్రభావం పడింది. ఎక్కువ మంది పెళ్లిళ్లలో మటన్, ఆ తర్వాత చికెన్, చేపలు, గుడ్లు, కూరగాయలు, పప్పుతో భోజనాలు పెడతారు. బర్డ్‌ఫ్లూ కారణంగా పెళ్లి విందులో చికెన్ తొలగిస్తున్నారు. ఈ నెల 16న జరిగిన పెళ్లిళ్లలో ఎక్కడా కూడా చికెన్ పెట్టిన దాఖాలాలు లేవు. దీంతో మటన్‌కు ప్రాధాన్యత పెరిగింది. డిమాండ్ కారణంగా మటన్ రేటు కూడా కిలో రూ.800 వరకు పలికింది.
తగ్గిన ఆసక్తి
స్థానికంగా ఫౌల్ట్రీ ఫారాలు ఎక్కువ లేకపోవడంతో వ్యాపారులు కరీంనగర్ జిల్లా నుంచి కోళ్లను కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటారు. చాలాచోట్ల ఎండల ప్రభావంతోనూ బాయిలర్ కోళ్లు చనిపోతున్నాయి. మరోవైపు బర్డ్‌ఫ్లూ కారణంగా చికెన్ ధరలు కాస్త తగ్గినా తినేందుకు మాత్రం ప్రజలు ముందుకు రావడం లేదు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని చికెన్ సెంటర్లలో వ్యాపారులు కిలో బాయిలర్ చికెన్ ధర రూ.180కు అమ్ముతున్నారు. గిరాకీ లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. కాగా, ఆదివారం మధ్యాహ్నం వరకు మటన్ మొత్తం అమ్ముడుపోవడం విశేషం. సాయంత్రం చేపల కోనేందుకు ప్రజలు బారులుదీరారు. చికెన్ అమ్మకాలు లేక ఆర్థికంగా నష్టపోతున్నట్లు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోడికి గిరాకీ పెరిగింది. కిలో నాటుకోడికి రూ.440 కాగా డ్రెస్ట్ చికెన్ కిలో రూ.480 వరకు అమ్ముతున్నారు.
ధర తగ్గించినా కొనడం లేదు
15 ఏళ్లుగా చికెన్ దుకాణం నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నా. వారం నుంచి రోజురోజుకూ అమ్మకాలు తగ్గుతున్నాయి. వారం క్రితం రూ.220 కిలో చికెన్ విక్రయించాం. ప్రస్తుతం రూ.180కు కిలో అమ్ముతున్నా. అయినా వినియోగదారులు ఎవరూ కొనడం లేదు. గతంలో రోజూ 80 కిలోల వరకు అమ్ముడుపోయేది. ప్రస్తుతం పది కిలోలైనా అమ్మడం లేదు.
– నషీం, చికెన్ వ్యాపారి, కౌటాల
ఆందోళన చెందొద్దు
జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కాలేదు. మూడు కోళ్ల ఫారాలను పరిశీలించి వారికి తగిన సూచనలు ఇచ్చాం. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు రాకుండా జిల్లాలో మూడు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచాం. 120 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు వేడి చేసుకుని చికెన్ వండితే వైరస్ చనిపోతుంది. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భయం లేకుండా చికెన్, కోడిగుడ్లు తినవచ్చు.
– సురేశ్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి
వినియోగదారులు లేక దుకాణాలు వెలవెల
బర్డ్ ఫ్లూ భయంతో కోడి మాంసం తినేందుకు వెనుకడుగు
జిల్లావ్యాప్తంగా అమ్మకాలు లేక నష్టపోతున్న వ్యాపారులు
మటన్, చేపల కోసం జనం బారులు
ఉడికించి తింటే మేలు..
ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ ద్వారా కోళ్లు, బాతులు, కొంగలు, పక్షులకు బర్డ్‌ఫ్లూ సోకుతుంది. ముక్కు, కళ్ల వెంట నీరు కారడం, మెడ వాల్చడం, నీరసంగా ఉండటం, కాళ్లు శరీర భాగాలపై మచ్చలు, తలపై భాగంలో ఉండే వాటిల్స్ ఉబ్బడం తదితర లక్షణాలు ఉంటాయి. వ్యాధి తీవ్రత ఎక్కుప్పుడు కోళ్లు చనిపోతాయని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూపై అప్రమత్తంగా ఉన్నామని, ఆందోళన చెందొద్దని పశుసంవర్థక శాఖ అధికారులు సూచించారు. చికెన్‌ను బాగా ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి కోళ్లు తరలించే వాహనాలపై దృష్టి సారించి ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు.
చికెన్ అమ్మకాలు డౌన్!
చికెన్ అమ్మకాలు డౌన్!
చికెన్ అమ్మకాలు డౌన్!
Comments
Please login to add a commentAdd a comment