టమాటా.. నష్టాలే దిగుబడి
● రెండు వారాలుగా తగ్గుతున్న ధర ● కిలో రూ.5కు పడిపోయిన వైనం ● కుంగిపోతున్న రైతులు ● జిల్లాలో 350 ఎకరాల్లో సాగు
కౌటాల: టమాటా ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. పంట కోతకు వచ్చిన తొలినాళ్లలో ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. కిలోకు రూ.20కి తక్కు వ కాకుండా ధర పలికింది. రైతులు ఒకింత ఆనందపడ్డా అది ఎంతోకాలం నిలవలేదు. రోజురోజుకూ ధరలు పతనం కావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మూడు వారాల క్రితం కిలోకు రూ.20 ధర పలుకగా ప్రస్తుతం రూ.5కు పడిపోయింది. పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులకు ధర నిర్ణయించుకునే వెసులుబాటు ఉన్నట్లుగా రైతుల పంట ఉత్పత్తికి రేటు నిర్ణయించుకునే అవకాశం లేకపోవడంతో మార్కెట్ ఒడిదుడుకులకు కుదేలౌతున్నారు.
జిల్లాలో 730 మంది రైతులు
జిల్లా వ్యాప్తంగా 730 మంది రైతులు రబీ సీజన్‌లో 350 ఎకరాల విస్తీర్ణంలో టమాటా పంట సాగు చేశారు. ఇందులో ఆసిఫాబాద్ డివిజన్‌లో 100 ఎకరాలు, కాగజ్‌నగర్ డివిజన్‌లో 250 ఎకరాల్లో టమాటా పంట సాగైంది. కౌటాల, బెజ్జూర్, కాగజ్‌నగర్, చింతలమానెపల్లి మండలాల్లోనే ఎక్కువగా సాగు చేశారు. కానీ పంట చేతికొచ్చిన తరుణంలోనే మార్కెట్‌లో ధర ఒక్కసారిగా పడిపోయింది. ఒక్కో 20 కిలోల టమాటా బాక్సు కనీసం రూ.250కు అమ్ముడుపోతే కానీ రైతుకు గిట్టుబాటు ఉండదు. కానీ ప్రస్తుతం ఒక బాక్స్ రూ.100కు మించి ధర రావడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. లాభాల సంగతి దేవుడెరుగు కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నష్టాల్లో రైతులు
ప్రస్తుతం రబీ సీజన్‌లో రైతులు సాగుచేసిన టమాటా పంట ఒకేసారి చేతికి వచ్చింది. దీంతో ధర పూర్తిగా పడిపోయింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఎకరానికి సుమారు రూ. 30 వేల వరకు పెట్టుబడి పెడుతున్న రైతన్న చివరికి గిట్టుబాటు ధర లభించక అప్పులపాలవుతున్నారు. కూలీల ఖర్చులు భరించే స్థితిలో లేక ఏరేందుకు సిద్ధంగా ఉన్న టమాటాలను పలువురు రైతులు చేనుల్లోనే వదిలేస్తున్నారు.
కోల్డ్ స్టోరేజీలేవి?
రైతుల పరిస్థితి ఎప్పుడు ఎలా దాపురిస్తుందో తెలి యని దుస్థితి. అందుకు కారణం పంటలను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడం ఒకటైతే, పంట ధరను నిర్ణయించేకునే అవకాశం లేకపోవడం రెండవది. ఇతర పంటలతో పోలిస్తే టమాటా ఎక్కువ కా లం నిల్వ ఉండదు. ఎండలకు త్వరగా పాడవుతుంది. ధర పరిస్థితి ఇలానే కొనసాగితే చాలా వరకు రైతు కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో సాగు చేస్తున్న టమాటాను స్థానికంగా విక్రయించుకునే అవకాశం ఇవ్వాలి. బయటి ప్రాంతం నుంచి దిగుబడి అయ్యే టమాటాను చెక్‌పోస్ట్‌ల ద్వారా అడ్డుకుంటే పరిస్థితి మారుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కూరగాయలు సాగు చేస్తున్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేసి పంటల నిల్వకు సౌకర్యం కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
నేను ఎకరం పొలంలో టమాటా పంట వేశా. ధరలు పడిపోవడంతో నష్టాలు వస్తున్నాయి. పెట్టుబడి వేలల్లో ఉంటే రాబడి మాత్రం వందల్లో ఉంటోంది. పొద్దుమాపు కష్టపడ్డా ఫలితం లేకుండా పోతంది. పంట సాగు చేయకున్నా బాగుండు అని అనిపిస్తోంది. ప్రభుత్వం టమాటా రైతులను ఆదుకోవాలి.
– ఆదే నాగయ్య, కన్నెపల్లి, కౌటాల
అధికారుల సూచనలు పాటించాలి
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఒకేసారి పంట చేతికి రావడంతో ధర పడిపోయింది. విడతల వారీగా, ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తే మేలు. ఒకేసారి దిగుబడి రావడంతో పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులు పంటల సాగు విషయంలో వ్యవసాయాధికారులు, శాస్త్రవేతల సలహాలు, సూచనలు పాటించాలి.
– అబ్దుల్ నదీం, ఉద్యానవనశాఖ జిల్లా అధికారి
తడిసి మోపెడవుతున్న ఖర్చు
అనావృష్టి కారణంగా గత వానాకాలం సీజన్‌లో కూరగాయల పంటలు భారీగా దెబ్బతిన్నాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో కేజీ టమాట కిలో రూ.60 వరకు ధర పలికింది. పంటకు మంచి డిమాండ్ ఉండడంతో ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా రైతులు టమాటా సాగు చేశారు. పంట కాలపరిమితి 5 నెలలు మాత్రమే. నాటిన మూడు నెలల నుంచి దిగుబడి మొదలవుతుంది. ఎకరం విస్తీర్ణంలో సాగు చేయాలంటే దున్నడానికి రూ.4 వేలు, విత్తనాల ఖరీదు రూ. 2,600, ఎరువులకు రూ.3 వేలకు పైగా, పురుగు మందులకు రూ.6 వేలకు పైగా ఖర్చు వస్తుంది. ఇక కూలీలు, టమాటాను మార్కెట్‌కు తరలించేందుకు రవాణా ఖర్చులు అదనం. ఇవన్నీ ఒక ఎత్తయితే మార్కెట్‌కు చేర్చిన తర్వాత ఏజెంట్ కమీషన్ 10 శాతం చెల్లించాలి.
టమాటా.. నష్టాలే దిగుబడి
టమాటా.. నష్టాలే దిగుబడి
Comments
Please login to add a commentAdd a comment