‘బర్డ్ ఫ్లూ’పై అప్రమత్తం
● తనిఖీల కోసం మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు ● పౌల్ట్రీ యజమానులకు వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నాం ● ‘సాక్షి’తో జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి సురేశ్‌కుమార్
ఆసిఫాబాద్‌అర్బన్: బర్డ్‌ఫ్లూ వ్యాధి జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. స్థానికంగా పౌల్ట్రీఫామ్‌లు తక్కువగా ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచే కోళ్లను దిగుమతి చేసుకుంటారు. వైరస్ వ్యాపిస్తుందనే భయంతో జిల్లాలో చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో మటన్, చేపలకు గిరాకీ పెరిగింది. అయితే బర్డ్‌ఫ్లూ వ్యాధిపై ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సురేశ్‌కుమార్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో వెటర్నరీ అధికారులు ఫౌల్ట్రీఫామ్‌లను సందర్శిస్తూ యజమానులకు జాగ్రత్త చర్యలు వివరిస్తున్నారని తెలిపారు. బర్డ్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఆదివారం ఆయన ‘సాక్షి’కి వివరించారు.
సాక్షి: బర్డ్‌ఫ్లూ వ్యాధి కట్టడికి జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
జిల్లా అధికారి: జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో ర్యాపిడ్ రియాక్షన్ టీం ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఈ బృందంలో ఒక వెటర్నరీ వైద్యుడు, ఒకరు పారా వెటర్నరీ సిబ్బంది ఉంటారు. జిల్లాలో నాలుగు కమర్షియల్ పౌల్ట్రీఫామ్స్ ఉన్నాయి. వాటి యజమానుల ఫోన్ నంబర్లు తీసుకున్నాం. వారికి ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ అవగాహన కల్పిస్తూ రక్షణ చర్యలు వివరిస్తున్నాం.
సాక్షి: జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
జిల్లా అధికారి: ప్రస్తుతం జిల్లాలో ఈ వైరస్ వ్యాప్తి లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల రవాణాపై దృష్టి సారించాం. జిల్లాలోని వెంకటాపూర్, ఇందాని, వాంకిడిలో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. అనుమతి లేకుండా వచ్చే పౌల్ట్రీ వాహనాలను తిరిగి పంపిస్తున్నాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.
సాక్షి: బర్డ్ ఫ్లూ కోళ్లకు ఎలా సోకుతుంది.. దాని లక్షణాలు ఏమిటి?
జిల్లా అధికారి: బర్డ్ ఫ్లూ వ్యాధి ఎక్కువగా పక్షి జాతుల్లో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం దీని వ్యాప్తి అధికంగా ఉండగా, తెలంగాణలోనూ కొన్నిజిల్లాల్లో లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది సాధారణంగా ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ద్వారా సోకుతుంది. ఒక కోడి నుంచి మిగితా వాటికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఫలితంగా ఒకేసారి వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడే ప్రమాదం ఉంటుంది. వ్యాధి సోకిన కోడి కళ్లు ఎర్రగా ఉంటాయి. తల కూడా బరుసుగా మారి, ముక్కు నుంచి ద్రవాలు కారుతుంటాయి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాయి. వాటి శరీర ఉష్ణోగ్రత పెరిగి ఆహారం తీసుకోవడం కూడా మానేస్తాయి.
సాక్షి: మనుషులకు సోకే అవకాశం ఉందా..?
జిల్లా అధికారి: బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా ఇప్పటివరకు మనుషులు చనిపోయిన ఘటనలు లేవు. వ్యాధి సోకినా సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం మేలు. సగం ఉడికించిన గుడ్లు, చికెన్ తినొద్దు. 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే అధికంగా ఉడికిస్తే వైరస్ చనిపోతుంది. పూర్తిగా ఉడికించిన చికెన్, గుడ్లు తినడం ద్వారా ఎలాంటి ప్రమాదం ఉండదు.
సాక్షి: ప్రజలు, కోళ్ల ఫారాల యజమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జిల్లా అధికారి: కోళ్ల ఫారాల యజమానులు అనుమతి, ముందు జాగ్రత్త చర్యలు లేకుండా ఇతరులను లోపలికి అనుమతించొద్దు. యజమానులు, అందులో పనిచేసే సిబ్బంది సైతం విధిగా మాస్కులు ధరించాలి. కోళ్లు, కోడి గుడ్లు రవాణా చేసే వాహనాలను శానిటేషన్ చేయడం ఉత్తమం. కోళ్లు ఉండే ప్రదేశాలను నిత్యం శుభ్రం చేయాలి. కోళ్లు చనిపోతే నిర్లక్ష్యంగా బయటపడేయకుండా గోతుల్లో పూడ్చివేయడం, లేదా దహనం చేయాలి.
‘బర్డ్ ఫ్లూ’పై అప్రమత్తం
Comments
Please login to add a commentAdd a comment