నేడు మంచిర్యాలకు సీఎం
సాక్షి ప్రతినిధి మంచిర్యాల: ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మంచిర్యాలకు రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలిక్యాప్టర్‌లో బయలు దేరుతారు. 11.45 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుని అక్కడ 11.50 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.15 గంటలకు మంచిర్యాలకు వచ్చి 2.20 నుంచి 3.55 వరకు సభకు హాజరవుతారు. సీఎంతోపాటు మంత్రులు, రాష్ట్రస్థాయి నా యకులు సభకు హాజరుకానున్నారు. ఈ సభకు 12వేల పట్టభద్రులను తరలించేలా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు సమీప ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పట్టభద్రులను సభకు రప్పించే ఏర్పాట్లు చేశారు. సీఎం సభ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లోని హెలి ప్యాడ్‌ను సిద్ధం చేశారు. డీసీపీ ఎ.భాస్కర్ నేతృత్వంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
‘బొగ్గుపెళ్లలు’ పుస్తకావిష్కరణ
మంచిర్యాలఅర్బన్: సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో ఎస్టేట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న అల్లం సుధాకర్ రచించిన బొగ్గుపెళ్లలు కవితా సంపుటిని కవి మలయశ్రీ ఆదివారం ఆవిష్కరించారు. మంచిర్యాల చార్వాక ట్రస్టు హాల్‌లో సాహితీ సంరక్షణ సమితి అధ్యక్షుడు వామన్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా అరసం ప్రధాన కార్యదర్శి డాక్టర్ మార్క శంకర్ పుస్తక సమీక్ష చేశారు. సమాజహితమే ప్రధాన ధ్యేయంగా పుస్తకంలో తన ఉద్యోగ ప్రస్థానం, సింగరేణితో అనుబంధం, కవులు, రచయితలు, కార్మికుల, కర్షకుల బాధలతో వచన సంపుటిలో ఆవిష్కరించారని వక్తలు అభిప్రాయపడ్డారు. పుస్తక రచయితను ఘనంగా సన్మానించారు.
అర్హులు ఓటుహక్కు వినియోగించుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులు ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో తెలి పారు. ఈ నెల 27న నిర్వహించే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు, పరిశ్రమలు, ట్రేడ్ ఇతర సంస్థల్లో పనిచేస్తున్న పట్టభద్రలు ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ రోజు సెలవుదినంగా ప్రకటించినట్లు తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగులు, అధికారులు సైతం ఓటుహక్కు వినియోగించుకునేలా విధుల్లో వెసులుబాటు కల్పిస్తున్న ట్లు వివరించారు. అన్ని యాజమాన్యాల కింద పనిచేసే సంస్థలు ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment