
ప్రజలకు అందుబాటులో ఉంటా
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు
చింతలమానెపల్లి(సిర్పూర్): నియోజకవర్గ ప్రజల కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మండలంలోని బాలాజీ అనుకోడ రైతు వేదికలో మంగళవారం చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాలకు చెందిన 189 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల శివార్లలో పోడు రైతులను అధికారులు ఇబ్బందులు కలిగించడం సరికాదన్నారు. అధికారులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. పోడు రైతులపై దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఫారెస్టు అధికారులు భూముల్లోకి వస్తే తనకు సమాచారం అందించాలని, వెంటనే అందుబాటులోకి వస్తానని తెలిపారు. అనంతరం రవీంద్రనగర్‌లో రూ.35లక్షలతో నిర్మించిన సీసీరోడ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు మునావర్ షరీఫ్, భూమేశ్వర్, డీటీలు భీమ్లానాయక్, దౌలత్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.