సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీలో టికెట్ల గోల మొదలైంది. కేవలం డబ్బున్నోళ్లకే చంద్రబాబు టికెట్లు కట్టబెడుతున్నారనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. సీనియర్లు అయినా, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారైనా సరే పట్టించుకోకుండా కేవలం కరెన్సీ కట్టలు తేగలిగిన వారికే టికెట్లు ఇస్తామని ఆ పార్టీ అధినేత చెబుతున్నారు. ధనం మూలం ఇదం ‘దేశం’అనే ఆర్యోక్తిని చంద్రబాబు బాగా వంట పట్టించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సంక్షేమ, అభివృద్ధి సుపరిపాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్ సీపీ ఏక పక్ష విజయం సాధించడమే దానికి తార్కాణం. గత అసెంబ్లీ ఎన్నికల కంటే రానున్న ఎన్నికల్లో మరింత ఘోర పరాభవం తప్పదని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.
కనీసం ఉనికినైనా చాటుకోవటానికి అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న డబ్బులను వెదజల్లుదామంటే కొడుకు లోకేష్, భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి అడ్డుతగులుతున్నారు. ఘోరంగా ఓడిపోవడానికి డబ్బులు తగలెయ్యడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేయడంతో చంద్రబాబు వ్యూహం మార్చారు. యఽఽథావిధిగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం అని గోబెల్స్‌ను తలదన్నే రీతిలో ఎల్లో మీడియాతో కలిసి ప్రచారం చేస్తున్నారు. దానిని అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో టికెట్ కావాలంటే డబ్బులు డిపాజిట్ చేయాలని షరతు పెడుతున్నారు. దీనిపై పార్టీలోని సీనియర్లు బెంబేలెత్తిపోతున్నారు. జనరల్ నియోజకవర్గానికి సగటున రూ.35 కోట్లు డిపాజిట్ చేసిన వారికే టికెట్ ఇస్తామని కరాఖండీగా చెబుతున్నారు.
గద్దె సైలెంట్...
తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామోహ్మనరావు వరుసగా రెండు సార్లు గెలిచారు. ఈసారి టికెట్ ఇవ్వాలంటే రూ.35 కోట్లు డిపాజిట్ చేయాలని చంద్రబాబు కోరినట్లు ఆయన వర్గీయులే చెబుతున్నారు. ఆ స్థాయిలో డిపాజిట్ చేయలేనని గద్దె తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు. దీంతో మరో అభ్యర్థిని చూసుకొంటానని, ప్రత్యామ్నాయంగా ఎక్కడో చోట అవకాశం కల్పిస్తామని చంద్రబాబు చెప్పడంతో గద్దె నిశ్చేష్టుడైనట్లు టీడీపీ కీలక నేత ఒకరు పేర్కొన్నారు. దీంతో కొంత కాలంగా ఆయన అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. నియోజకవర్గంలోని కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉమా ఉక్కిరి బిక్కిరి....
ప్రజాదరణ పక్కన పెడితే చంద్రబాబు శిష్యుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీలో చక్రం తిప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. పాపం తన టికెట్‌కు లోకేష్ ఎసరు పెడుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు రూ.35 కోట్లు డిపాజిట్ చేస్తేనే టికెట్ అని, మైలవరంగానీ, పరిస్థితిని బట్టి ఇంకో నియోజకవర్గంలో గానీ అవకాశాలు కల్పిస్తామని లోకేష్ నిక్కచ్చిగా చెప్పడంతో ఉమా చంద్రబాబును ఆశ్రయించారు. బాబు సైతం లోకేష్ చెప్పిన మాటలకు వంత పలకడంతో దేవినేని డైలమాలో పడ్డారు. ఓటమి ఖాయంగా కనిపిస్తున్నప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడమా, లేదంటే పోటీకి దూరంగా ఉండి ఎమ్మెల్సీ ఇస్తే తీసుకోవడమా అనే మీమాంసలో ఉన్నారు.
రగిలిపోతున్న సీనియర్లు....
టీడీపీ ఆవిర్భావం నుంచి నమ్ముకొని అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ వెన్నంటి నడిచిన నాయకులను చంద్రబాబు, లోకేష్ గడ్డి పోచలా తీసి పారేస్తున్నారు. డబ్బున్న నేతలు, ఎన్నారైలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో సీనియర్లు రగిలిపోతున్నారు. గుడివాడలో పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న రావి వెంకటేశ్వరావును పక్కన పెట్టి వెనిగండ్ల రామును అభ్యర్థిగా ఖరారు చేయడంలో కేవలం డబ్బు సంచులను చూసేనని టీడీపీ వర్గీయులే అంటున్నారు. గన్నవరంలో సైతం యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్ ఖరారు చేయడంలో ఇదే ఫార్ములా పాటించినట్లు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.ఇంకా ఇలా పార్టీలో ఎంత మందికి ఎర్త్ పెడతారోనని సీనియర్లు మదనపడుతున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను డబ్బున్న వారిని, ఎన్నారైలను వెతుకులాడే పనిలో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment