జీవన సొరంగాలు
చుట్టూ చీకటి.. ఊపిరి ఆడని పరిస్థితి.. స్వేచ్ఛగా కాళ్లూ చేతులు కదిపేందుకు వీలు లేని పరిసరాలు.. శరీరం నుంచి చెమట ధారలు.. ఇవేవీ వారి పనికి అడ్డంకులు సృష్టించ లేవు. ఒప్పుకున్న పని పూర్తిచేసి అప్పగించడమే వారి ముందున్న ఏకై క లక్ష్యం. వారసత్వంగా వస్తున్న కష్టాన్నే ఆస్తిగా స్వీకరించి, ఎంతో ఇష్టంగా సొరంగాలు తవ్వుతూ బతుకు పోరాటం చేస్తున్నారు ఈ కార్మికులు. దశాబ్దాలుగా ప్రభుత్వ పనులే చేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు దక్కక నిరాదరణకు గురైన కార్మికుల బతుకు పోరాటమే ఈ కథనం.
కష్టమైనా ఇష్టంగా..●
● సొరంగం తవ్వకాలే జీవనాధారంగా శ్రమిస్తున్న కార్మికులు ● వాటర్, ఆయిల్, గ్యాస్ పైపులైన్ల కోసం పనులు ● అన్నీ ప్రభుత్వ పనులే అయినా కష్టానికి దక్కని గుర్తింపు ● రాష్ట్ర వ్యాప్తంగా ఈ రంగంలో పనిచేస్తోంది ఐదు బృందాలే ● జి.కొండూరులో 24 మీటర్ల పొడవైన సొరంగం తవ్వుతున్న వైనం
జి.కొండూరు: సొరంగాలు (టన్నెల్) తవ్వకాలే జీవనాధారంగా పలువురు కార్మికులు శ్రమిస్తున్నారు. టన్నెల్ తవ్వకాలే వృత్తిగా రాష్ట్రంలో ఐదు బృందాలు జీవిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా, తణుకు మండలం మహాలక్ష్మిచెరువు గ్రామానికి చెందిన కుడిపూడి శివకృష్ణ బృందం వాటిలో ఒకటి. పదకొండు మందితో కూడిన ఈ బృందం పన్నెండేళ్లుగా టన్నెళ్ల తవ్వకాలను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఈ బృందం 50 సొరంగాల వరకు తవ్వింది. తక్కువలో తక్కువ అంటే 20 అంగుళాల వెడల్పు నుంచి ఏడు అడుగుల వెడల్పుతో వందమీటర్ల పొడవు వరకు సొరంగాలను తవ్వింది. చదరపు మీటరు సొరంగం తవ్వకానికి రూ.8 వేల వరకు ఈ బృందం తీసుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ ఈ బృందం సొరంగాలు తవ్వింది. విశాఖపట్నంలో 39 అంగుళాల వెడల్పుతో వంద మీటర్ల పొడవు, ఏలూరులో రైల్వే ట్రాక్ కిందగా 30 అంగుళాల వెడల్పుతో 90 మీటర్ల పొడవున ఈ బృందం తవ్విన సొరంగాలు ముఖ్యమైనవి. పని ఒప్పుకున్నప్పటి నుంచి పూర్తయ్యే వరకు పని ప్రదేశంలోనే ఈ బృదం క్యాంపు ఏర్పాటు చేసుకుని నివసిస్తుంది. కుటుంబాలకు దూరంగా ఎన్నిరోజులైనా ఉండి పని పూర్తిచేసే వెళ్తుంది.
ఊపిరాడని పని
సగటు మనిషి కదలడానికి వీలు కాని 20 అంగుళాల వెడల్పుతో కూడిన ఎన్నో సొరంగాలను ఈ బృందం విజయవంతంగా పూర్తి చేసింది. తవ్వకాల్లో ఆక్సిజన్ సిలిండర్, లైటు, త్రీ ఫేజ్ జనరేటర్, హైడ్రాలిక్ పవర్ ప్యాక్ యంత్రం, మట్టి తవ్వడానికి కంప్రషన్ మిషన్, రాళ్లను తొలచడానికి డ్రిల్లింగ్ యంత్రం వంటి పరికరాలను ఈ బృందం వినియోగిస్తుంది. సొరంగాల్లో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రెండు అడుగుల మేర తవ్విన తర్వాత ఐరన్ పైపును చొప్పిస్తూ కార్మికులు ముందుకు సాగుతారు.
జి.కొండూరులో 24 మీటర్ల సొరంగం తవ్వకం
జి.కొండూరు బైపాస్ వై జంక్షన్ నుంచి ఎ.కొండూరు మండలానికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.49 కోట్లతో పైపులైను ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జాతీయ రహదారిని తవ్వే అవకాశం లేకపోవడంతో పది అడుగుల లోతులో ఒకమీటరు వెడల్పు, 24 మీటర్ల పొడవుతో సొరంగం తవ్వుతున్నారు.
ప్రభుత్వాల నుంచి ఆదరణ కరవు
సొరంగం తవ్వకాలే జీవనాధారంగా కుడిపూడి శివకృష్ణ బృందంతో పాటు రాష్ట్రంలో మరో నాలుగు బృందాలు పని చేస్తున్నాయి. తవ్వడానికి వీలు కాని జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులు, గట్టు ప్రదేశాల్లో ఈ బృందాలు పని చేస్తాయి. వీరు కాకుండా అంగుళం నుంచి 18 అంగుళాల వరకు వెడల్పుతో కూడిన సొరంగాలను యంత్రాలతో తవ్వే బృందాలు ఉన్నాయి. సొరంగం లోపలకు వెళ్లి పని చేసే ఈ బృందాలకు మాత్రం ఏ ప్రభుత్వమూ గుర్తింపునివ్వలేదు. వీరు తవ్వే సొరంగాలు అన్నీ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమే అయినప్పటికీ గుర్తింపు మాత్రం దక్కడంలేదు. ప్రభుత్వాల ఆదరణ లేకున్నా సామాజిక బాధ్యతగా ఊపిరి ఉన్నంతవరకు ఇదే పని చేస్తామంటున్న కార్మికుల మాటలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
జీవన సొరంగాలు
Comments
Please login to add a commentAdd a comment