శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
మచిలీపట్నంటౌన్: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26వ తేదీన జిల్లాలోని పలు శైవక్షేత్రాలకు ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్ సర్వీసులను తిప్పుతున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి ఎ.వాణిశ్రీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26వ తేదీ తెల్లవారు జామునుంచి దాదాపు 90 ప్రత్యేక బస్ సర్వీసులను సాధారణ చార్జీలతోనే నడుపుతారని పేర్కొన్నారు. ఉయ్యూరు నుంచి ఐలూరుకు 25 బస్సులు, మచిలీపట్నం నుంచి పెదకళ్లేపల్లికి 40, మచిలీపట్నం నుంచి పామర్రు మీదుగా ఐలూరుకు 15, అవనిగడ్డ, చల్లపల్లి నుంచి పెదకళ్లేపల్లికి 10, అవనిగడ్డ నుంచి సంగమేశ్వరానికి 3 ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడుపుతామని వివరించారు. ఈ సర్వీసులను శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
కృష్ణా న్యాయసేవా అథారిటీ సెక్రటరీ జిల్లా జైలు సందర్శన
విజయవాడలీగల్: కృష్ణా జిల్లా న్యాయసేవా అథారిటీ సెక్రటరీ కె.వి.రామకృష్ణయ్య సోమవారం విజయవాడ జిల్లా జైలును సందర్శించారు. జైలులో ఖైదీలు, రిమాండ్ ఖైదీలకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత న్యాయ సేవలు, సౌకర్యాలు నక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు బెయిల్, అప్పీలు, ఇతర న్యాయ సేవలపై అవగాహన కల్పించి, వారిలో పరివర్తన కల్పించారు. సందర్శనలో భాగంగా కంప్లైంట్ బాక్స్‌లో ఏమన్నా ఫిర్యాదులు ఉన్నాయా అని తనిఖీచేశారు. ఖైదీల వయస్సు దృష్ట్యా వారికి అందజేస్తున్న వైద్యసేవలను జైలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు జైలు సూపరింటెండెంట్ హంసపాల్, ప్యానల్ న్యాయవాది కె.త్రినాథ్‌కుమార్ పాల్గొన్నారు.
పోస్టర్ రహిత నగరంగా విజయవాడ
కమిషనర్ ధ్యానచంద్ర
పటమట(విజయవాడతూర్పు): విజయవాడను పోస్టర్ రహిత నగరంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామని, నగరంలో బహిరంగంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు అతికించడం నిషేధమని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే వీఎంసీ నిబంధనలను అతిక్రమించిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రూ. 50 వేలు జరిమానా విధించామని ఆయన ప్రకటించారు. విజయవాడ పోస్టర్ రహిత నగరం అయినందున కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా నగరంలో ప్రజారోగ్యం– పర్యావరణ పరిస్థితులు, నగర సుందరీకరణను కాపాడటానికి నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ప్రహరీ గోడలు, ట్రాఫిక్ డివైడర్లు, విద్యుత్ స్తంభాలు ట్రాఫిక్ ఇలాండ్స్ , ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు తదితర ప్రాంతాల్లో పోస్టర్లను అతికించడం నిషేధమని వివరించారు. ఇకపై ఏవైనా సంస్థలు తమ ప్రకటనల నిమిత్తం వాల్ పోస్టర్లను నగరంలో ఎక్కడైనా అతికిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకటనదారులు, ప్రింటింగ్ ప్రెస్ కూడా రూ. లక్ష వరకు గరిష్ట జరిమానాను వసూలు చేస్తామని ప్రకటించారు. నగరంలో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పోస్టర్లను అతికించిన, ప్రింటింగ్ చేసిన వారిని గుర్తించామని, వారందరిపై తదుపరి చర్యలను తీసుకునేక్రమంలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముగ్గురికి రిమాండ్
గన్నవరం: గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై రెండేళ్ల క్రితం జరిగిన దాడి కేసులో పోలీసులు, సీఐడీ అధికారులు అరెస్ట్‌ల పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ కేసులోని ముగ్గురు వైఎస్సార్ సీపీ నేతలను అరెస్ట్ చేసి విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో సోమవారం హాజరుపరిచారు. వివరాలిలా ఉన్నాయి. ఈ కేసులో ఏ–27, 28గా ఉన్న కై లే శివకుమార్, కై లే ఆదిలక్ష్మి దంపతులను ఆదివారం గన్నవరం పోలీసులు అరెస్ట్ చేసి సీఐడీకి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఏ–54గా ఉన్న గన్నవరం మాజీ సర్పంచి నీలం ప్రవీణ్‌కుమార్(బాలు) సోమవారం సీఐడీ అధికారుల వద్ద స్వచ్ఛందంగా లొంగిపోయారు. అనంతరం వీరిని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా జడ్జి వీరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
Comments
Please login to add a commentAdd a comment