● రూ.60 కోట్ల సేవాపన్ను ఎగవేతదారునిగా ఆలపాటి ● భూకబ్జాలు, రౌడీయిజం, అనైతిక రాజకీయాలు.. ● ఎన్నికల సమయంలోని కరపత్రాలు వెలుగులోకి ● వైఎస్సార్ సీపీకి దగ్గరంటూ లక్ష్మణరావుపై ట్రోలింగ్ ● పోటాపోటీగా సోషల్ మీడియాలో పరస్పర పోస్టింగులు ● అభ్యర్థుల గుణగణాలపై పట్టభద్రుల లోతైన పరిశీలన ● ఓటర్లు బేరీజు వేసుకుంటున్నారంటూ కూటమిలో బేజారు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఓటర్లు నిశానీలు కారు. పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చిరుద్యోగులు, నిరుద్యోగులు. విభిన్న రంగాలు, వర్గాలకు చెందిన 3,47,116 మంది ఓటర్లు. సోషల్ మీడియాలో ప్రధానపోటీదారుల గుణగణాలు, గత చరిత్ర, రాజకీయ వ్యవహారాలు ఆధారసహితంగా హోరెత్తుతున్నాయి. పలు ఊహాజనిత, నిరాధార ఆరోపణలూ జోరందుకున్నాయి. ఈ ఎన్నికలు ఈవీఎంలతో కాదు బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరగనున్నాయి. తొమ్మిది నెలలుగా పచ్చమీడియా సహకారంతో పడికట్టు, కనికట్టు మాటలతో మోసగిస్తున్న ప్రభుత్వ పాలనాతీరు ప్రతిఒక్కరి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అసలే రాజకీయ చైతన్యవంతమైన జిల్లాలకు చెందిన పట్టభద్రులు ప్రతిదీ బేరీజు వేసుకుని కర్రుకాల్చి వాతపెడతారేమోననే బేజారు టీడీపీ నేతల మాటల్లో వ్యక్తమవుతోంది.
కూటమి నేతల్లో ఆందోళన
కృష్ణా– గుంటూరు పట్టభద్రుల స్థానానికి ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ కూటమి నేతల్లో ఆందోళన అధికమవుతోంది. ఈ నెల 27న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో టీడీపీకి చెందిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పోటీదారైన పీడీఎఫ్ అభ్యర్థి కె.ఎస్.లక్ష్మణరావు మద్దతుదారులు పోటాపోటీగా సోషల్ మీడియా వార్‌కు తెరతీశారు. అభ్యర్థులిరువురూ గుంటూరుకు చెందిన వారైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితులు. మాజీ మంత్రి ఆలపాటి సీనియర్ నాయకుడు. విద్యావేత్త అయిన లక్ష్మణరావు 14 ఏళ్లుగా శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి అభ్యర్థి గురించి ఆయా సందర్భాల్లో తీవ్ర అవినీతి ఆరోపణలు, ఆర్థిక అరాచకాలు, రౌడీయిజం, దాడులు లాంటి నేరారోపణలు, పలు విమర్శలు లేకపోలేదు. వాటన్నింటినీ గుర్తు చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తుండటం తాజాగా చర్చనీయాంశమైంది. కూటమి నేతలకు ఇది కొరుకుడుపడని అంశంగా మారి ఆందోళన రేకెత్తిస్తోంది.
రూ.60 కోట్ల పన్ను ఎగవేత?
ఆర్థిక లావాదేవీల్లో లోపాలతో పాటు పన్నులు ఎగొట్టారనే నేరారోపణలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై ఉన్నాయి. అప్పీలుకు వెళ్లగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా తోసిపుచ్చాయని, పన్నులు చెల్లించాల్సిందేనని హైకోర్టు నిర్ధారించిందని రాజకీయ ప్రత్యర్థులు గుర్తుచేస్తున్నారు. ఎన్.ఆర్.ఐ. విద్యా సంస్థల ద్వారా విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజుల్లో రూ.60 కోట్లకు పైగా సర్వీసు ట్యాక్స్‌ను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని, దీనిపై ఇప్పటికీ న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్నాయంటున్నారు.
● తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తారనే అంచనాలతో ఆలపాటి రాజకీయ అరంగ్రేటం మొదలు ఆయన అకృత్యాలంటూ ప్రత్యర్థులు కరపత్రాలు ముద్రించి మరీ ప్రజల దృష్టికి అనేక అంశాలను ఇదివరకే తీసుకొచ్చారు. పల్నాడు ప్రాంతంలో గొర్రెల పెంపకం మాటున, సాఫ్ట్‌వేర్ సంస్థ చాటున, గుంటూరులో చిట్‌ఫండ్, ఫైనాన్స్ ద్వారా, తన సంబంధీకుల పేరుతో, ఇతర బినామీల పేరిట రియల్ ఎస్టేట్ ముసుగులో అటు బ్యాంకులను, ఇటు ప్రజలను మోసం చేశారని, తన రాజకీయ పలుకుబడి, దౌర్జన్యాలతో సెటిల్‌మెంట్లు చేసుకున్నారనే ఆరోపణలు గుప్పించారు. మంత్రిగా ఉన్నప్పుడు భారీగా జిల్లాలో ఇసుక కుంభకోణాలకు పాల్పడ్డారని, ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతుల ద్వారా కోట్లు సంపాదించారని, మంగళగిరి– తాడేపల్లి పరిధిలోని ఆంధ్ర సిమెంటు ఫ్యాక్టరీని బినామీ పేర్లతో కొనుగోలుచేసి కార్మికులకు నష్టం చేశారని, విభిన్న ప్రాంతాల్లో క్రిస్టియన్ ఆస్తులను కొల్లగొట్టి స్థిరాస్తులుగా మలచుకున్నారనే తీవ్రారోపణలు లేకపోలేదు. ఎన్.ఆర్.ఐ ఆసుపత్రి వ్యవహారాల్లోనూ ఆలపాటిపై అనేక విమర్శలు రావడాన్ని గుర్తుచేస్తున్నారు.
లక్ష్మణరావుపైనా పోస్టింగులు..
పీడీఎఫ్ అభ్యర్థి కె.ఎస్.లక్ష్మణరావుపైనా సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం పెచ్చరిల్లుతోంది. అవినీతి ఆరోపణలు, రాజకీయపరమైన అంశాలు అటుంచి వ్యక్తిత్వ హననానికి ప్రత్యర్థులు తెగపడ్డారని, లేనిపోని విషయాలను చిలవలు పలవలు చేస్తున్నారని ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినతిపత్రం ఇచ్చేప్పుడు కిందపడిన కాగితాలను తిరిగి తీసుకునే క్రమంలో లక్ష్మణరావు సీఎం పాదాలకు నమస్కరించారని, ఆయన వైఎస్సార్ సీపీ మద్దతుదారుగా ట్రోల్ చేయడం వారి దిగజారుడుతనానికి పరాకాష్ట అంటున్నారు. మూడు పర్యాయాలు పీడీఎఫ్ సభ్యుడిగా శాసనమండలికి ఎన్నికై విభిన్న అంశాలను చర్చకు తీసుకొచ్చి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేసిన లక్ష్మణరావుపై యూటీఎఫ్ తదితర సంఘాల పేరిట తప్పుడు పోస్టింగులు కూడా పెట్టిస్తుండటాన్ని ఆయా సంఘాల నేతలు ఖండిస్తున్నారు. కె.ఎస్.లక్ష్మణరావుపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమవారం ఫిర్యాదులు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment