
స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీతో పాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. ఆయన తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే కాకుండా అంతకు ముందుగా కూడా ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, క్లయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం, అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సహాయ సహకారాలు అందించాలన్నారు. ఇకపై ప్రతి నెలా గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు తీసుకుని ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటా మని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల అంశాలు ఏమైనా ఉంటే సమావేశంలో ప్రస్తావించాలని కోరారు. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సరిదిద్దటం వల్ల స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారవుతుందని పేర్కొన్నారు. అప్పుడే రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితాపై విశ్వాసం కలుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో హడావుడి చేయకుండా ముందుగానే పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపు, మరుగుదొడ్లు తదితర కనీస సౌకర్యాలు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టి, కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎక్కడైనా బూత్‌స్థాయి అధికారుల స్థానాలు ఖాళీగా ఉంటే భర్తీ చేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు కోసం నమోదు చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు షేక్ సలార్‌దాదా, కొడాలి శర్మ, పి.వి.గజేంద్ర, బత్తిన దాసు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డెప్యూటీ తహసీల్దార్ ఎం.వి.శ్యామ్‌నాథ్, వై.నారాయణ పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల ఏర్పాటులోసలహాలు, సూచనలు ఇవ్వండి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ