
ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు చేరువ చేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వాటి లబ్ధిని వారికి చేరువ చేసేలా అధికారులు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో వ్యవసాయ, ఉద్యాన తదితరశాఖల అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల వినియోగంపై గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు విద్యకు ప్రాధాన్యతను ఇస్తూ ప్రజల సంక్షేమాభివృద్ధికి ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సూచించారు. జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం ద్వారా పప్పు, బియ్యం, మినీ యంత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు జిల్లాకు ఎక్కువ మొత్తంలో యూనిట్లు మంజూరు చేసే విధంగా వ్యవసాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపాలన్నారు.
కృష్ణా విశ్వవిద్యాలయంలో
ఆక్వా ల్యాబ్ ఏర్పాటు..
గుడివాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బాలాజీ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొబైల్ భూసార పరీక్షలకు అవసరమైన వాహనాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ధాన్యం ఆరబెట్టే యంత్రాల కొనుగోలుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వాటిని జిల్లాకు వెంటనే అందించేందుకు సంబంధించిన చెల్లింపులు సకాలంలో ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తేనటీగల పెంపకంపై ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై ఆసక్తి ఉన్న వారికి అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. అవనిగడ్డలో 39 మంది లబ్ధిదారులకు తేనెటీగల పెంపకం కిట్లను అందించామని తోట్లవల్లూరులో ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తున్నామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో ఆక్వా ల్యాబ్ ఏర్పాటుకు యూనివర్సిటీ అధికారులు సంసిద్ధంగా ఉన్నారని మత్స్యశాఖ అధికారులు వారితో సమన్వయం చేసుకుంటూ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారం తీసుకోవాలన్నారు. సమావేశంలో మత్స్యశాఖ జిల్లా అధికారి నాగబాబు, వ్యవసాయశాఖ డీడీ మనోహరరావు, పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ విజయలక్ష్మి, కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎన్.ఉష, బయో సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ వై.మారుతీ తదితరులు పాల్గొన్నారు.