
నూతన ఆర్థిక చట్టాన్ని వ్యతిరేకిద్దాం
బీఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి వరప్రసాద్
పటమట(విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక నూతన ఆర్థిక విధానాల్ని వ్యతిరేకించాలని, పెన్షన్ విధానంలో మార్పులు చేస్తూ దొడ్డిదారిన పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లు పెట్టారని ఆలిండియా బీఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి వి.వరప్రసాద్ అన్నారు. అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పటమటలోని రఘురామ కల్యాణ వేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి పదేళ్లకు జరిగే వేతన సవరణలో ఉద్యోగులకు పెరిగే వేతనాలకు తగ్గట్టుగా పెన్షన్‌లో కూడా పెంపుదల జరిగే మార్పులు చేస్తూ 2026 నుంచి రిటైర్ అయ్యే వారికి మాత్రమే వేతన సవరణ అవకాశం కల్పించిందని అన్నారు. ఈ నూతన పెన్షన్ విధానం పాత పెన్షనర్స్‌కు మాత్రం మార్పులు లేని విధంగా, న్యాయపరమైన జోక్యం లేకుండా చట్టం చేస్తూ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్స్ మెడకు ఉరితాడు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి సి. భాస్కరరావు, సర్కిల్ కార్యదర్శి టి.ఆశీర్వాదం, సలహాదారు డి.దుర్గారావు కోశాధికారి శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.