వంశీ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా | - | Sakshi
Sakshi News home page

వంశీ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా

Published Sat, Apr 5 2025 2:07 AM | Last Updated on Tue, Apr 8 2025 1:51 PM

గన్నవరం: కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన స్థల వివాదం కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు తీర్పు సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో వంశీమోహన్‌ బెయిల్‌ పిటిషన్‌పై స్థానిక 8వ అదనపు ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో గురువారం వాదనలు పూర్తి కాగా తీర్పును రిజర్వ్‌ చేశారు. ఈ కేసు తీర్పు శుక్రవారం వెలువడాల్సిన నేపథ్యంలో ఆత్కూరు పోలీసులు వంశీని మరోసారి కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపులా న్యాయవాదుల వాదనలు విన్న జడ్జి తీర్పును సోమవారం ఇవ్వనున్నట్లు తెలిపారు. బెయిల్‌ పిటిషన్‌పై కూడా అదే రోజు తీర్పు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

నలుగురు కూలీలను కాపాడి మేస్త్రి మృతి

గన్నవరం: శ్లాబ్‌ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో నలుగురు మహిళలను రక్షించే క్రమంలో కాంక్రీట్‌ లిఫ్ట్‌ గడ్డర్ల కింద పడిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటనపై శుక్రవారం గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన పిల్లిబోయిన కొండలు(35) కాంక్రీట్‌ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గన్నవరం మండలం మాదలవారిగూడెంలో ఓ భవనానికి శ్లాబ్‌ నిర్మాణ నిమిత్తం గురువారం కొంత మంది కూలీలను తీసుకుని వెళ్లారు. శ్లాబ్‌ నిర్మాణం జరుగుతున్న సమయంలో కాంక్రీట్‌ను పైకి లిఫ్ట్‌ చేసే యంత్రంలో సాంకేతిక సమస్య తలెత్తింది.

దీంతో లిఫ్ట్‌ బాక్స్‌ వైర్లు ఒక్కసారిగా తెగి ఐరన్‌ గడ్డర్లు కిందపడిపోవడం గమనించిన కొండలు.. అక్కడే ఉన్న మహిళలను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఆ నలుగురు మహిళలను పక్కకు నెట్టివేసి.. కొండలు మాత్రం బరువైన లిఫ్ట్‌ బాక్స్‌ గడ్డర్ల కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అతనికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై గన్నవరం ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

చిల్లకల్లు(జగ్గయ్యపేట): భర్త వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిల్లకల్లులో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన బత్తుల భవానీ (25)కి 2015లో చిల్లకల్లుకు చెందిన బత్తుల శ్రీనుతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త అల్ట్రాటెక్‌ కర్మాగారంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. భర్త మద్యానికి బానిసై గత కొంత కాలంగా భార్యను వేధిస్తున్నాడని ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్యన వాగ్వాదం జరగటంతో భార్యను కొట్టటంతో మనస్తాపం చెందిన భవానీ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఉదయం సమయంలో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి వెంకటేష్‌ భర్త వేధింపులు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఐపీఎస్‌ మనీషా రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement