
జై భవానీ.. జైజై భవానీ
దుర్గమ్మకు విశేష సేవలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు శుక్రవారం పలు విశేష సేవలు జరిగాయి. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ, పల్లకీ సేవ, దర్బారు సేవలు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు పాల్గొని తరించారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ చేయగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత పల్లకీ సేవ జరిగింది. పల్లకీపై ఆది దంపతులు కొలువుదీరగా, మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య అమ్మవారి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశారు. అనంతరం పూజా మండపంలో అమ్మవారికి దర్బారు సేవ జరిగింది. గత శనివారం నుంచి శుక్రవారం వరకు ఆలయంలో జరిగిన విశేష సేవలు, ఆదాయ, వ్యయా లను అమ్మవారికి ఆలయ అర్చకులు వివరించారు. ఉద యం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. సర్వదర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 టికెటు క్యూలైన్‌లో అమ్మవారి దర్శనం గంట లోపే పూర్తయింది. రద్దీ నేపధ్యంలో ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లను ఏఈవో చంద్రశేఖర్, ఇతర ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
పల్లకీ సేవలో ఉభయదాతలు, భక్తులు