
రైతులపై కూటమి నిర్లక్ష్యం
కంకిపాడు: పెసర కొనుగోళ్లు ప్రారంభమై నెల కావస్తోంది. నేటికీ ఏ ఒక్క రైతు ఖాతాలోనూ ఒక్క పైసా కూడా జమ కాలేదు. రోజుల తరబడి సొమ్ము కోసం రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. స్వయంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఓ రైతు పెసర సొమ్ము ఎప్పుడిస్తారంటూ ప్రశ్నిస్తే ప్రతిపాదనలు వెళ్లాయంటూ ఆయన మొక్కుబడిగా సమాధానం ఇచ్చి వెళ్లిపోయారు. దీనిని బట్టి రైతులపై కూటమి సర్కారుకు ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. పేరుకేమో రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రచారం చేసుకుంటున్న కూటమి సర్కారు రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిందంటూ రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో కృష్ణాజిల్లా వ్యాప్తంగా 2,84,237 ఎకరాల్లో మినుము, మూడు వేల హెక్టార్లలో పెసర సాగైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించటంతో పంట దిగు బడులు ఆశాజనకంగా వచ్చాయి. ఎకరాకు ఏడెనిమిది క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. ఎకరాకు పంట చేతికొచ్చేనాటికి రూ.30 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు.
బయట మార్కెట్ డీలా
గత ఏడాది రబీ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది రబీ సీజన్‌లో బయటి మార్కెట్‌లు డీలా పడ్డాయి. మినుము మద్దతు ధర క్వింటా రూ.7400 ఉంటే బయట మార్కెట్‌లో రూ.7200 మాత్రమే. గత ఏడాది రూ.9100 వరకూ ధర పలికింది. పెసర క్వింటా మద్దతు ధర రూ.8682. రూ.7400లకు మించి ధర దక్కటం లేదు. అపరాల రైతులు పడుతున్న మద్దతు కష్టాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. డిమాండ్‌కు అనుగుణంగా గత నెల 19న జిల్లాలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ధర వ్యత్యాసం తక్కువగా ఉండటంతో మినుము రైతులు స్థానికంగానే దళారులకు పంట విక్రయిస్తున్నారు. మరి కొందరు మంచి ధర కోసం నిల్వ చేసుకుంటున్నారు. పెసర రైతులు మాత్రం క్వింటాకు రూ.1200 వరకూ తేడా ఉండటంతో కొనుగోలు కేంద్రాలకు తరలించి పంటను విక్రయిస్తున్నారు.
రవాణా, కూలి ఖర్చుల భారం
రవాణా, కూలి ఖర్చులు రైతులకు తలకు మించిన భారంగా మారాయి. కొనుగోలు కేంద్రం వద్దకు పెసరను ప్రైవేటు వాహనాల్లో తరలించటం, జల్లెడ పట్టించటం, కాటా వేయటానికి అయ్యే ఖర్చులు కూడా రైతులే భరించాల్సి ఉంది. పెట్టుబడులతో పాటు రవాణా, కూలి ఖర్చులు రూ.2 వేలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
నెల రోజులుగా సాగుతున్న పెసర కొనుగోళ్లు ఇప్పటి వరకూ ఒక్క పైసా అందక రైతుల అవస్థలు నగదు కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్‌కు గోడు వినిపించిన రైతు అయినా రైతుల ఆవేదనను పట్టించుకోని ప్రభుత్వం
రైతులకు
అందని సొమ్ము
ప్రతిపాదనలు పంపించాం
జిల్లా వ్యాప్తంగా 683 టన్నుల పెసర కొనుగోలు చేశాం. రైతులకు అందాల్సిన సొమ్ముపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపించాం. నాలుగు రోజుల్లో సొమ్ము విడుదలవుతుందని సమాచారం. విడుదల కాగానే రైతులకు ఖాతాలకు జమ చేస్తాం. రైతులు ఆందోళన చెందొద్దు.
– మురళీకిషోర్,
డీఎం, మార్క్‌ఫెడ్, కృష్ణాజిల్లా
కూటమి ప్రభుత్వం రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. సీజన్ ముగియగానే మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా రైతులు తీవ్ర అగచాట్లు పడ్డారు. పంటకు మార్కెట్‌లో ధర పలకక, కొనుగోలు కేంద్రాలు తెరవక, దళారులకు తెగనమ్ముకుని నష్టపోయారు. ఆర్థికంగా నష్టాన్ని చవిచూశారు. మార్కెట్ పరిస్థితులపై ముందుగానే క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా నివేదిక తెప్పించుకుని తదనుగుణంగా రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యల్లో కూటమి విఫలమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా ఆరుగొలను, పెరికీడు, ఆత్కూరు, కంకిపాడు, కేసరపల్లి, బొడ్డపాడు, గుడివాడ, మొవ్వ ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పెసలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 344 మంది రైతుల నుంచి 683.75 టన్నుల పెసర కొనుగోలు చేసి గోదాములకు తరలించారు. ఇందుకు రైతులకు రూ.3.77 కోట్లు అందాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా నేటికీ ఒక్క రూపాయి కూడా రైతులకు అందలేదు. కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోందని, తమను నిర్లక్ష్యం చేయటం అలవాటుగా మారిందని రైతులు వాపోతున్నారు. పెసర సొమ్ము అందక ఇబ్బంది పడుతున్నామంటూ కోలవెన్నుకు చెందిన ఓ రైతు ఇటీవల పునాదిపాడులో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ప్రశ్నిస్తే ప్రతిపాదనలు పంపాము రాగానే వస్తాయంటూ వెళ్లిపోవటం గమనార్హం.

రైతులపై కూటమి నిర్లక్ష్యం

రైతులపై కూటమి నిర్లక్ష్యం