
ప్రణాళిక లేని ‘సమీక్ష’
చిలకలపూడి(మచిలీపట్నం): వేసవి ప్రణాళికలు లేవు.. గత సమావేశపు నిర్ణయాలపై సమీక్షలు లేవు.. రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం.. రెండు గంటల్లోనే చర్చ సమాప్తం.. అంతా తూతూమంత్రం, మొక్కుబడి పర్వం.. ఇది గురువారం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరిగిన రెండో జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్‌సీ) తీరు. సాధారణంగా డీఆర్‌సీలో రానున్న మూడు నెలల్లో వాతావరణ పరిస్థితులను బట్టి ప్రజల అవసరాలను ఏ విధంగా తీర్చాలో చర్చ జరగాలి.. గత డీఆర్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా అమలు చేస్తున్నారో వాటిపై కూడా సంబంధిత అధికారులు.. మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే అలాంటివేమి లేకుండానే సమీక్ష ముగిసింది. ఉదయం పది గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై కేవలం రెండు గంటల్లో ముగియడం గమనార్హం.
వ్యవసాయ అనుబంధ శాఖలపై సమీక్ష..
డీఆర్‌సీ సమావేశంలో తొలుత వ్యవసాయ అనుబంధశాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముందుగా పంట బీమాపై చర్చ జరిగింది. ఈ చర్చలో వ్యవసాయశాఖ అధికారులు హెక్టారుకు రూ. 1.03 లక్షల బీమాకు రూ. 3 వేలు ప్రీమియం చెల్లించాలని, బ్యాంకు నుంచి రుణం పొందితే ఇన్‌స్యూరెన్స్ ప్రీమియం బ్యాంకు అధికారులు మినహాయించి రుణం ఇస్తారని, రుణం పొందని రైతులు సమీపంలోని సచివాలయానికి వెళ్లి తప్పనిసరిగా బీమాకు సంబంధించిన ప్రీమియం చెల్లిస్తే ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు నష్టపరిహారం అందే అవకాశం ఉంటుందని కలెక్టర్ ఈ సమీక్షలో తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రతి మిల్లులో డ్రయ్యర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ అధికారులకు సూచించారు. తోట్లవల్లూరు మండలంలో మొక్కజొన్న ఎక్కువగా పండిందని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వీరంకి గురుమూర్తి సభ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రొటోకాల్‌పై నిలదీత..
నియోజకవర్గాల్లో జిల్లా అధికారులు ఎటువంటి కార్యక్రమాలు చేసినా తమకు తెలియపర్చటం లేదని పామర్రు శాసనసభ్యుడు వర్ల కుమార్‌రాజా సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజాప్రతినిధులకు తెలియకుండానే సమావేశాలు పెట్టుకుంటున్నారని ప్రజలు ఎన్నుకున్న తమకు శాఖలపరంగా విషయాలు తెలియపరిస్తే తాము కూడా ప్రజలకు అవగాహన కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమయంలో గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తమ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై సమావేశాలు తనకు తెలియకుండా నిర్వహిస్తున్నారని కనీసం ప్రొటోకాల్ కూడా పాటించరా? అని ఆయన కలెక్టర్‌ను ప్రశ్నించారు. అధికారికంగా నిర్వహించే సమావేశాలకు కూడా తనకు ఆహ్వానం లేకపోతే తదుపరి మీరు పంపే ఆహ్వానాలకు తాను హాజరుకానని ఆయన తేల్చి చెప్పారు. కృష్ణాజిల్లా నుంచి ఎక్కువగా వలస పోతున్నారని, దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించటం లేదన్నారు. జిల్లాలో అన్యాక్రాంతమైన భూములపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కలెక్టర్ వివరించాల్సిన అవసరం ఉందని యార్లగడ్డ నిలదీశారు. అలాగే పశుసంవర్ధకశాఖపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
మొక్కుబడిగా ముగిసిన డీఆర్‌సీ సమావేశం
రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం ప్రొటోకాల్‌పై ఎమ్మెల్యేల రగడ కలెక్టర్‌పై ఎమ్మెల్యే యార్లగడ్డ అసహనం
జిల్లా అధికారులు బందరులోనే ఉండాలి..
ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించే సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అధికారులు కాలువలపై దృష్టిసారించడం లేదని మండిపడ్డారు. ఇంజినీరింగ్ అధికారులు ఎక్కువగా విజయవాడ నుంచి వస్తున్నారని అన్నిశాఖల అధికారులందరూ బందరులో కచ్చితంగా ఉండాల్సిందేనని హెచ్చరించారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించాలని మంత్రి సూచించారు.

ప్రణాళిక లేని ‘సమీక్ష’