
విద్యుత్ అదాలత్‌లతో సమస్యల పరిష్కారం
సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేల్
చల్లపల్లి: ఏపీసీపీడీసీఎల్ పరిధిలో ఉన్న ఏడు సర్కిల్స్‌లో అపరిష్కృతంగా ఉన్న విద్యత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కన్జూమర్ గ్రీవెన్సెస్ రెడ్రస్సెల్ ఫోరం(సీజీఆర్‌ఎఫ్) పనిచేస్తోందని సంస్థ చైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ తెలిపారు. చల్లపల్లిలో గురువారం జరిగిన విద్యుత్ అదాలత్ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లా డారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, పల్నాడుతో పాటు డీఆర్‌డీఏ సర్కిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సర్కిళ్ల పరిధిలో ఉన్న వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సీజీఆర్‌ఎఫ్ పని చేస్తోందన్నారు. గతంలో సమస్యల పరిష్కారం కోసం తిరుపతి వరకూ వెళ్లాల్సి వచ్చేదన్నారు. 2020లో విజయవాడ గుణదల ప్రధాన కేంద్రంగా తనతోపాటు మరో ముగ్గురు సభ్యులతో ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రజలు వ్యవప్రయాసలకోర్చి ఇక్కడి వరకూ రావాల్సిన అవసరం లేకుండా వారి వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు విద్యుత్ వినియోగదారుల అదాలత్‌లు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ ఏడు సర్కిళ్ల పరిధిలో నాలుగేళ్లలో 190 ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారుల అదాలత్‌లు నిర్వహించిగా వెయ్యికి పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు. నాలుగు సమస్యలు మాత్రమే పెండింగ్‌లో ఉండగా, మిగిలిన వాటిని పరిష్కరించామని తెలిపారు. సమస్యలను పరిష్కరించడంలో తిరుపతి, విశాఖపట్నం సీజీఆర్‌ఎఫ్‌ల కంటే విజయవాడ సీజీఆర్‌ఎఫ్ ముందు వరుసలో ఉందన్నారు.