ఎమ్మిగనూరురూరల్: ఆలనాపాలనా చూసుకోవాల్సిన తల్లి వదిలేసి వెళ్లింది.. సంరక్షకుడిగా ఉన్న తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు.. చిన్నమ్మ వద్ద ఉంటున్న బాలుడికి పెద్ద కష్టమొచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి బిస్కెట్‌లో మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలుడిని ముళ్లపొదల్లో వదిలేశాడు. రాత్రంతా బాలుడు అక్కడే ఉన్నాడు. ఉదయం మెలకువ వచ్చిన తర్వాత తాను ఉన్న ప్రాంతాన్ని చూసి భయంతో వణికిపోయాడు. ఈ ఘటన ఎమ్మిగనూరు పట్టణంలో చోటుచేసుకుంది.
వివరాలు.. స్థానిక శివన్న నగర్‌లో బాలుడు నరేష్(12) తన చిన్నమ్మ వీరేశమ్మ దగ్గర ఉంటున్నాడు. మనస్పర్ధలు రావటంతో బాలుడి తండ్రి వీరేష్, తల్లి సరోజమ్మలు ఐదు సంవత్సరాల క్రితం విడిపోయారు. తండ్రి వీరేష్ వద్ద బాలుడిని వదిలేసి తల్లి తన పుట్టినిల్లు అయిన గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడుకు వెళ్లిపోయింది. వీరేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో బాలుడు నరేష్ తన చిన్నమ్మ వీరేశమ్మ దగ్గర ఉంటున్నాడు. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం అమావాస్య కావడంతో టెంకాయ తీసుకురావడానికి వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు.
దీంతో బాలుడి మేనత్త భాగ్య, చిన్నమ్మ వీరేశమ్మ వెతికినా ఎక్కడా కనిపించకపోవటంతో రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం బాలుడి మేనత్త శివన్ననగర్‌లోని బంక్ పరిసర ప్రాంతంలో వెతుకుతుండగా ముళ్లపొదల పక్కన బాలుడు పడుకుని ఉండటం గమనించింది. ముఖంపై నీళ్లుచల్లి.. ఏమి జరిగిందని నరేష్‌ను విచారించగా.. టోపీ పెట్టుకున్నవ్యక్తి వచ్చి తనకు బిస్కెట్ ఇచ్చాడని, మత్తురావటంతో ఆ వ్యక్తి తనను తీసుకెళ్లినట్లు చెప్పాడు.
బాలుడిని తీసుకెళ్లిన వ్యక్తి మత్తు బిస్కెట్ ఎందుకు ఇచ్చాడు, తీసుకెళ్లి ముళ్లపొదల్లో ఎందుకు పడేశాడు అనేది తెలియరాలేదు. బాలుడు భయంతో వణికిపోతున్నాడు. ముళ్లు శరీరంపై గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నరేష్‌ను మేనత్త భాగ్య సోమప్ప నగర్‌లో తన ఇంటికి తీసుకొచ్చింది. పట్టణంలో పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తులు సంచరిస్తున్నారనే వదంతులతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment